ఏలూరు, ఏప్రిల్ 27: జిల్లాలో ఏర్పడిన డీజిల్ సరఫరా సమస్యను మంగళవారం ఉదయం నాటికి పూర్తిగా పరిష్కరించి సాధారణ పరిస్థితికి తీసుకువస్తామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
జిల్లాలో మొత్తం 232 పెట్రోల్, డీజిల్ రిటైల్ ఔట్లెట్లు ఉన్నాయని, డీజిల్ పూర్తిగా అయిపోయిన బంకులకు సోమవారం రాత్రి నుంచే సరఫరా ప్రారంభించి మంగళవారం ఉదయం నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రోజువారీ వినియోగం సగటున 350 కిలోలీటర్లుండగా, వదంతుల కారణంగా ఇది 500 కిలోలీటర్లకు పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం 600 కిలోలీటర్ల వరకు సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
సోషల్ మీడియా వదంతుల ప్రభావంతో ప్రజలు అధికంగా డీజిల్ కొనుగోలు చేయడం వల్లే ఈ తాత్కాలిక సమస్య తలెత్తిందని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ఆదివారం కూడా ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపి సరఫరా పెంచే చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
రబీ ధాన్యం రవాణా వాహనాలు, ఆక్వా రంగం, అత్యవసర వైద్య సేవలకు ప్రాధాన్యతగా ఇప్పటికే 12 వేల లీటర్ల డీజిల్ సరఫరా చేసినట్లు తెలిపారు. ఈ అవసరాల కోసం 432 అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
డీజిల్ సమస్యలపై ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లో **7569296272** నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే సంప్రదించాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకుని డీజిల్‌ను దారిమళ్లించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ, వేసవికాలంలో ఇళ్లలో అధికంగా డీజిల్ నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజలు అవసరానికి మించిన కొనుగోళ్లు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వదంతులను నమ్మకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ట్రైనీ కలెక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

