జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 25: ఉపాధి హామీ చట్టం అమలులో ఈ-కేవైసీ, ఆన్లైన్ మస్టర్ విధానాలను తొలగించి పాత విధానంలోనే పనులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. సమావేశానికి సంఘం నాయకుడు వై. నాగేంద్రరావు అధ్యక్షత వహించగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రవి, జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మండుటెండల్లో కూలీలకు యాప్‌ల పేరుతో మస్టర్లు నమోదు చేయించడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య కూడా పనులు చేయిస్తున్నారని, పేస్ యాప్ వంటి విధానాలు కూలీలకు భారంగా మారాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వడదెబ్బతో ఉపాధి పనులకు వెళ్లిన పలువురు కూలీలు ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. మరణించిన కుటుంబాలకు తక్షణమే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ చట్టం కోసం గతంలో నిర్వహించిన పోరాటాలను గుర్తుచేస్తూ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మూడు పూటల మస్టర్లు పేరుతో కూలీలపై భారం పెంచుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు రావాల్సిన బకాయిలు వందల కోట్లు ఉన్నాయని, ఇటీవల జరిగిన ఆందోళనలతో కొంతమేర నిధులు విడుదలయ్యాయని తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను సమయానికి చెల్లించకపోవడం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే ఉపాధి హామీ పనిదినాలను 200 రోజులకు పెంచి, రోజుకు రూ.600 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎండల సమయంలో చలువ పందిళ్లు, మంచినీరు, మజ్జిగ, మెడికల్ కిట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం రానున్న నెలలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభల్లో చర్చించి, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులందరినీ సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎం. జీవరత్నం, ఎస్. మహంకాళి, జి. వెంకట్రావు, యు. వెంకటేష్, ఎస్. కోటేశ్వరరావు, కారం దుర్గ, యాగంటి సీత, హోలీ మేరీ, రాజశేఖర్, కే. మాధవ తదితరులు పాల్గొన్నారు.

