ఏలూరు, ఏప్రిల్ 27: బాలల సంరక్షణ, వారి అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఏలూరు జిల్లా మంచి ప్రగతి సాధిస్తోందని ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యులు వి. గాంధీబాబు పేర్కొన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో బాలల సంరక్షణకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలు అమలు చేస్తున్న పథకాలపై ప్రదర్శనలు పరిశీలించిన అనంతరం గాంధీబాబు మాట్లాడారు.
జిల్లాలో బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న శాఖల మధ్య సమన్వయం సమర్థవంతంగా సాగుతోందని, దీనికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చూపిస్తున్న చొరవ, అంకితభావం ప్రధాన కారణమని ఆయన ప్రశంసించారు. బాలలను సొంత పిల్లలుగా భావించి అధికారులు పనిచేయడం వల్లే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ఏలూరు జిల్లాను పూర్తిస్థాయిలో బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేయాలని సూచించారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దాలని తెలిపారు.
అయితే బాల్య వివాహాలు, కౌమార దశ గర్భధారణ, లైంగిక దాడులు, పోషకాహార లోపం వంటి సమస్యలు ఇంకా ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంటూ, వీటి నివారణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి పి. శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సి.హెచ్. సూర్యచక్రవేణి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ యు. శోభ, జిల్లా పరిషత్ సీఈఓ పి. జగదాంబ, డీఆర్‌డీఏ పీడీ టి.వి. విజయలక్ష్మి, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారావు, సోషల్ వెల్ఫేర్ డీడీ వై. విశ్వమోహన్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

