ఏలూరు/భీమడోలు : ఏలూరు పట్టణం మరియు భీమడోలులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, విజిలెన్స్ ఎస్పీ కె. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విజిలెన్స్, పౌర సరఫరాలు మరియు రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా భీమడోలు మరియు ఏలూరులోని గ్యాస్ ఏజెన్సీలైన గోపాల్ ఏజెన్సీ (భీమడోలు), ఎక్సెల్ ఏజెన్సీ, విజయ ఏజెన్సీస్, శ్రీ సాయి దుర్గ ఇండేన్ సర్వీస్‌లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిల్వలలో ఎలాంటి వ్యత్యాసాలు లేనట్లు గుర్తించారు. గ్యాస్ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో గ్యాస్ సరఫరా చేయాలని, ఎక్కడైనా అధిక ధరలకు విక్రయించడం లేదా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పీ హెచ్చరించారు.
తదుపరి ఏలూరులోని వెంకటేశ్వర మయూరి హోటల్ (వసంతమహల్ సెంటర్), సితార హోటల్ (మెయిన్ బజార్), మౌలాలి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లలో తనిఖీలు చేపట్టగా 13 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు గుర్తించారు. విచారణలో వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ (సబ్సిడీ) గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. దీంతో హోటల్ యజమానులపై Essential Commodities Act 1955 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ డి. ప్రసాద్ కుమార్, విజిలెన్స్ తహసిల్దార్ బి. కన్యాకుమారి, విజిలెన్స్ ఎస్ఐ చి. రంజిత్ కుమార్, కె. నాగరాజు మరియు పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.



.jpeg)