దెందులూరు/పెదవేగి: దెందులూరు నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.250 కోట్లతో బృహత్తర ప్రణాళిక రూపొందించినట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 18న జరగనున్న సమావేశంలో ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రిఎన్.చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
శనివారం పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు, ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వాటిని పరిశీలించి సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తూ, ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొలుసు పార్థసారథి మరియు జిల్లాలోని ఇతర శాసనసభ్యులతో కలిసి జరగనున్న ప్రత్యేక సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు తెలిపారు.
దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించామని, దీనికి అవసరమైన రూ.250 కోట్ల నిధులను మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.



.jpeg)