ఏలూరు: ఏలూరులోని ఆర్.ఆర్.పేట స్ఫూర్తి భవన్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ 143వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చడానికి గొప్ప ఆలోచనలను అందించిన మహానుభావుడు కార్ల్ మార్క్స్ అని కొనియాడారు. ప్రపంచంలో అసమానతలు తొలగిపోవడానికి పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకోవడమే ప్రధాన కారణమని మార్క్స్ తన రచనల ద్వారా ప్రపంచానికి తెలియజేశారని అన్నారు. తన మిత్రుడు ఫ్రెడరిక్ ఏంజెల్స్ తో కలిసి మార్క్స్ అనేక రచనలు చేసి కార్మికులు, కర్షకుల సమీకరణకు కృషి చేశారని తెలిపారు.
సమాజంలో అసమానతలు లేకుండా, దోపిడీ లేని సమాజం కోసం సోషలిస్టు వ్యవస్థ స్థాపన అవసరమని మార్క్స్ ఆకాంక్షించారని డేగా ప్రభాకర్ పేర్కొన్నారు. మార్క్స్ ఇచ్చిన శాస్త్రీయ దృక్పథం ఆధారంగా సమాజాన్ని విశ్లేషించి మార్పు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలో అంతరాలు లేని సమాజం కోసం ఆలోచించిన మహోన్నత వ్యక్తి కార్ల్ మార్క్స్ అని కొనియాడారు. అదనపు విలువ సిద్ధాంతం ద్వారా కార్మికుల హక్కులపై ప్రపంచానికి అవగాహన కల్పించిన గొప్ప మేధావి అని తెలిపారు.
ఈ సందర్భంగా సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శి కురెళ్ల వర ప్రసాద్ మాట్లాడుతూ 1818 మే 5న జర్మనీలోని ట్రయర్ పట్టణంలో జన్మించిన కార్ల్ మార్క్స్ 1883 మార్చి 14న లండన్‌లో కన్నుమూశారని, కానీ ఆయన ఆలోచనలు ఇప్పటికీ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మార్క్స్ చూపిన మార్గంలో నడుస్తూ దోపిడీ, అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, గొర్లి స్వాతి, కొండేటి రాంబాబు, బళ్ల కనక దుర్గారావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పుప్పాల కన్నబాబు, ఉప్పులూరి లక్ష్మి, భవాని, శ్రీదేవి, బేతా శంకర్, మురళి తదితరులు పాల్గొన్నారు.



.jpeg)