Ticker

6/recent/ticker-posts

భీమడోలు గ్రంథాలయంలో ‘చదవటం మాకు ఇష్టం’ కార్యక్రమం – మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన


భీమడోలు మండలం/ఉంగుటూరు, మార్చి 8: భీమడోలు శాఖ గ్రంథాలయంలో “చదవటం మాకు ఇష్టం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు రిసోర్స్ పర్సన్లు మండే సుధాకర్, కాపాక సతీష్‌లు పుస్తక సమీక్ష, పుస్తక పఠనం, రచయితల పరిచయం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.


అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మరియు మహిళలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే గ్రంథాలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాత అల్లూరి ఉషారాణిని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి తన వంతుగా రూ.50 వేల ఆర్థిక సహాయం అందిస్తానని అభివృద్ధి కమిటీ నిర్వాహక సభ్యురాలు అల్లూరి ఉషారాణి హామీ ఇచ్చారు. గ్రామ పెద్దల సహకారంతో గ్రామంలో నూతన గ్రంథాలయ భవనం నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆమె సేవలను విద్యార్థులు, పెద్దలు అభినందిస్తూ కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ కార్యదర్శి కాపాక సతీష్, మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ యలమర్తి రవీంద్ర కుమార్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్, లీడర్స్ ఫారమ్ కమిటీ అధ్యక్షులు ముప్పిరి శెట్టి సుబ్రహ్మణ్యం, గ్రంథపాలకుడు శ్రీనివాస్, పేరెంట్స్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.