Ticker

6/recent/ticker-posts

స్పీకర్ మీద అవిశ్వాసం...విపక్షం బిగ్ ట్విస్ట్


INDIA NEWS: లోక్ సభలో అధికార ఎన్డీయే ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో బడ్జెట్ సెషన్ రెండవ దశ మొదటి రోజే వాయిదాల పర్వం కొనసాగింది. గత నెల 13తో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తొలి దశ ముగిసింది. రెండో సెషన్ మార్చి 9న ప్రారంభం అయింది. అయితే ఈ సెషన్ మొదలవుతూనే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం మీద సభ చర్చ జరుపుతుందని అంతా భావించారు. చర్చ ఒక రోజు లేదా రెండు రోజుల పాటు జరిగి ఓటింగ్ జరిగితే రిజల్ట్ ఏంటో తేలిపోయేది. 


సభలో ఎన్డీయేకు ఉన్న భారీ మెజారిటీ కారణంగా ఓం బిర్లా మీద అవిశ్వాసం వీగిపోతుంది అని అంతా అనుకున్నదే. అయితే ఫిబ్రవరి 13 నాటికి జాతీయ స్థాయిలో ఉన్న అంశాలలో స్పీకర్ మీద అవిశ్వాసం కీలకంగా ఉంది. కానీ ఇపుడు చూస్తే పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా సీన్ మొత్తం మారింది. మరెన్నో ప్రాధాన్యత కలిగిన అంశాలు తెర మీదకు వచ్చేశాయి. దాంతో లోక్ సభ మొదలవుతూనే కాంగ్రెస్ సహా విపక్షాలు అన్నీ బిగ్ ట్విస్ట్ ఇచ్చాయి. 

యుద్ధం పై చర్చకు పట్టు : ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ కలిపి చేస్తున్న యుద్ధం మీద చర్చకు విపక్షం పట్టుబట్టడం విశేషం. అయిత సభ మొదలవుతూనే విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పశ్చిమాసియాలో తాజాగా నెలకొన్న పరిస్థితి పై స్వయంగా ప్రకటన చేశారు. ఆయన ప్రకటన ఇస్తున్న నేపధ్యంలోనే కాంగ్రెస్, డీఎంకే, ఎస్పి ఇతర చెందిన ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి వచ్చారు. పశ్చిమాసియా పరిస్థితిపై చర్చ జరిగి తీరాల్సిందే అని విపక్షం సభ్యులు పట్టుబట్టారు. దాంతో పలు మార్లు సభ వాయిదా పడింది. 

ఇక దీని మీద పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రతిపక్షాల ప్రవర్తనను తీవ్రంగా విమర్శించారు. బాధ్యతారహితమైన ప్రతిపక్షంగా ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్‌కు వ్యతిరేకంగా తీర్మానానికి సంబంధించి ప్రతిపక్షం నోటీసు ఇచ్చిందని, అది లోక్ సభ తొలి రోజు చర్చా కార్యక్రమంలో ఉందని ఆయన అన్నారు. అయితే ప్రతిపక్షాలు గందరగోళంలో ఉన్నాయని, తాము స్పీకర్ మీద ఇచ్చిన అవిశ్వాసం తీర్మానం నోటీసుని పక్కన పెట్టి పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మీద చర్చకు డిమాండ్ చేస్తున్నాయని కేంద్ర మంత్రి విమర్శించారు. 

అవే ప్రధానం అంటూ : ఇక ప్రతిపక్షం అయితే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని పక్కన పెట్టింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం తో పాటు చమురు ధరలు, గల్ఫ్ దేశాల నుంచి భారతీయుల తరలింపు వంటి అంశాల్ని వ్య్హూహాత్మకంగానే లేవనెత్తింది. ప్రస్తుతం వంట గ్యాస్ ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దేశ ఆర్ధిక పరిస్థితి మీద ఈ యుద్ధం పెద్ద ప్రభావం చూపిస్తోంది. దాంతో ఇదే తమకు ముఖ్యమని విపక్షం ఈ అంశాన్ని ఎంచుకుందని అంటున్నారు. 

రాహుల్ విమర్శలు : దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారుతున్నా కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రం ముఖ్యమైన అంశాల మీద చర్చ నుంచి తప్పించుకుంటోందని ఆయన ఆరోపించారు. భారత్ విదేశాంగ విధానం మీద వ్యూహాల మీద చర్చ సాగాలని ప్రతిపక్షం కోరుకుంటోంది. అయితే అజెండా ప్రకారం చూస్తే స్పీకర్ మీద అవిశ్వాసంపై చర్చ జరగాలని అధికార పక్షం అంటోంది. మొత్తానికి చూస్తే విపక్షం సడెన్ గా గేర్ మార్చేసరికి అధికార పక్షం అయితే ఇరకాటంలో పడింది అని అంటున్నారు.