Ticker

6/recent/ticker-posts

ఏపీలో గ్యాస్ కష్టాలు లేవు.. పుకార్లు నమ్మొద్దు.. ఏపీ పౌరసరఫరాల శాఖ క్లారిటీ


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌పీజీ (LPG) సరఫరాపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు నిండుకున్నాయని, సరఫరా నిలిచిపోతుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ పరిస్థితి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉందని వెల్లడించింది.


రాష్ట్రంలో గ్యాస్ గణాంకాలు ఇవే:

ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 161.19 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.

IOCL: 56.86 లక్షలు (36.07 లక్షల సింగిల్ బాటిల్ + 20.79 లక్షల డబుల్ బాటిల్)

HPCL: 74.11 లక్షలు (45.36 లక్షల సింగిల్ బాటిల్ + 28.75 లక్షల డబుల్ బాటిల్)

BPCL: 30.22 లక్షలు (19.09 లక్షల సింగిల్ బాటిల్ + 11.13 లక్షల డబుల్ బాటిల్)

రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ గృహ అవసరాలకు 4,000 మెట్రిక్ టన్నుల (MT) గ్యాస్ అవసరం అవుతుండగా, ఈ నెల 12 నాటికి 15,880 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఇది రాష్ట్ర అవసరాలకు దాదాపు 4 రోజుల వరకు సరిపోతుందని ప్రభుత్వం వివరించింది.

పుకార్ల వల్ల పెరిగిన బుకింగ్స్:

దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఉందన్న తప్పుడు ప్రచారం వల్ల వినియోగదారులు ఆందోళనకు గురై, సాధారణం కంటే 15 శాతం అదనంగా రీఫిల్ బుకింగ్స్ చేసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని పంపిణీలో పారదర్శకత కోసం OTP ఆధారిత డెలివరీ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు.

గృహ అవసరాలకే ప్రాధాన్యత:

ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

పరిశ్రమలకు కట్: పరిశ్రమలకు ఇచ్చే బల్క్ ఎల్‌పీజీ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది.

కమర్షియల్ నియంత్రణ: వాణిజ్య అవసరాలకు ఇచ్చే సరఫరాపై కఠినమైన ఆంక్షలు విధించింది. కేవలం ఆసుపత్రులు, హాస్టళ్లు, ప్రభుత్వ సేవలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.

నిరంతర పర్యవేక్షణ: ప్రతి ఆరు గంటలకు ఒకసారి స్టాక్ పాయింట్లను తనిఖీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది.

ఆర్టీజీఎస్ (RTGS) నిఘాలో గ్యాస్ సరఫరా:

రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS)లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రెవెన్యూ, పోలీస్, పౌరసరఫరాలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ, మంత్రుల బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 'సోషల్ మీడియా మానిటరింగ్ సెల్'ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పుకార్లు నమ్మి అనవసరంగా గ్యాస్ బుకింగ్స్ చేయవద్దని, అందరికీ సకాలంలో గ్యాస్ అందుతుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.