Ticker

6/recent/ticker-posts

నవరత్నాలు కాదు అప్పుల రత్నాలు ఇచ్చారు.. జగన్‌పై ఎమ్మెల్యే మాధవి ఫైర్


అమరావతి, మార్చి 14: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. గంటల తరబడి జగన్ మీడియా ముందుకు వచ్చి సోది చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. జగన్ నిజాలు మాట్లాడితే బాగుండేదని.. ఆయన పాపాల భారాన్ని కూటమి ప్రభుత్వంతోపాటు ప్రజలూ మోస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో చేసిన అప్పుల కుప్పపై శ్వేతపత్రం విడుదల చేసిందని తెలిపారు. కాగ్ అని సరిగ్గా పలకలేని వాళ్లు గంటల తరబడి ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో కాగ్‌కు తెలియకుండా కార్పొరేషన్లను తాకట్టుపెట్టి చేసిన అప్పులకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


నవరత్నాలు ఇవ్వలేదు కానీ రూ.9లక్షల కోట్లకు పైగా అప్పుల ‘రత్నాలు’ ప్రజలకు ఇచ్చారని ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కామ్‌లు చేయడానికే నవరత్నాలు అనే పేరుతో ప్రజాధనాన్ని దోచేశారని ఆరోపించారు. ఎవరి జేబులు నింపుకోవడానికి అప్పులు చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక తల్లికి ఇద్దరు పిల్లలుంటే ఒకరికే అమ్మఒడి ఇచ్చి మరొకరికి అన్యాయం చేశారని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రతి రూపాయికి లెక్క చెబుతోందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. జగన్‌కు సమాధానం కావాలంటే అసెంబ్లీకి రావాలని సూచించారు. వైసీపీ హయాంలో ప్రతిదీ కల్తీ అయ్యిందని, భగవంతుడి ప్రసాదాన్నీ భయం, భక్తి లేకుండా కల్తీ చేశారని ఆరోపించారు.

హత్యలు, కుట్రలు, దోపిడీలు చేస్తారని.. కానీ ఎవరూ మాట్లాడకూడదని కోర్టుల చుట్టూ తిరుగుతారని వైసీపీపై ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారం కోసం సొంత బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసి, ఆ హత్య గురించి మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న ఘనత జగన్‌దని వ్యాఖ్యానించారు. జంతు కొవ్వు, ప్రమాదకర రసాయనాలతో తిరుమల లడ్డూను కల్తీ చేసి లక్షలాది భక్తుల ఆరోగ్యం, విశ్వాసాన్ని నాశనం చేశారని ఆగ్రహించారు. ఆ పాపం బయటపడుతుంటే ‘ఎవరూ మాట్లాడకూడదు’ అని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి మొట్టికాయలు తిన్నారని వైసీపీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పిటిషన్ కేవలం క్రిమినల్ కేసులో నిందితులను రక్షించడానికి చేసిన పనికిమాలిన ప్రయత్నమని సుప్రీంకోర్టు కొట్టేసిందని పేర్కొన్నారు. కల్తీ నెయ్యిపై చర్చ జరగకుండా అసెంబ్లీ నుంచి వైసీపీ నేతలు పారిపోయారంటూ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యలు చేశారు.