విశాఖపట్నం, మార్చి 1: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండి పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు.
సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు 8688400499 ఫోన్ నంబరు ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను సీఎండి దృష్టికి తీసుకురావాలనుకునే వినియోగదారులు తమ విద్యుత్ సర్వీసు నంబరు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల మంజూరులో జాప్యం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఆలస్యం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, రూఫ్‌టాప్ సోలార్ వంటి అంశాలపై ఫిర్యాదులను నేరుగా సీఎండి దృష్టికి తీసుకురావచ్చన్నారు.
సంస్థ పరిధిలోని 11 జిల్లాల విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎండి పృథ్వీతేజ్ ఇమ్మడి విజ్ఞప్తి చేశారు.


.jpeg)
