Ticker

6/recent/ticker-posts

అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది – మంత్రి కొలుసు పార్థసారధి


ఏలూరు/నూజివీడు, మార్చి 1: మహిళా శిశు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలు, చిన్నారులకు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందించడంతో పాటు స్వంత భవనాలు నిర్మిస్తూ త్రాగునీరు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు.


కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసి, వాటిని ప్రీ-ప్రైమరీ స్కూల్స్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లకు 15 రోజుల వేసవి సెలవులు కల్పించామని చెప్పారు.

గత ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలు దయనీయ స్థితిలో ఉండేవని, టీచర్లకు జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో వారు ఇబ్బందులు పడేవారని అన్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో టెలివిజన్, ఆర్‌ఓ వాటర్, ఆటవస్తువులు, చార్టులు, ఇండక్షన్ స్టవ్‌లు, నాణ్యమైన వంట పాత్రలు వంటి పలు సౌకర్యాలు కల్పించామని తెలిపారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్లు ఇచ్చినట్లు చెప్పారు.

అంగన్వాడీ టీచర్ల 9 డిమాండ్లలో చాలా వరకూ నెరవేర్చామని, ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిందని, వారు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు సార్లు జీతాలు పెంచిందన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో త్రాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటుకు రూ.86.68 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే సుమారు రూ.75 కోట్లతో 5G మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసి 58,204 మంది అంగన్వాడీ టీచర్లకు అందించామని, తద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుతున్నాయని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు.