Ticker

6/recent/ticker-posts

రేషన్ బియ్యం దళారుల దందా కొనసాగుతూనే... చింతలపూడి – లింగపాలెం మండలాల్లో అక్రమ రవాణాపై ఆరోపణలు


చింతలపూడి, ఫిబ్రవరి 28: పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని దళారులు అక్రమంగా సేకరించి విక్రయిస్తున్న ఘటనలు చింతలపూడి, లింగపాలెం మండలాల్లో కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పేదలకు అన్నదానం అందించేందుకు రేషన్ వ్యవస్థను అమలు చేస్తుండగా, కొందరు దళారులు ఆ బియ్యాన్ని అక్రమంగా సేకరించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ లోపు రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున సేకరించి అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం. రేషన్ దుకాణాల యజమానులను బెదిరిస్తూ కొంతమంది మధ్య దళారుల ద్వారా బియ్యం సేకరించి పెద్ద దళారులకు పంపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

విజిలెన్స్ మరియు పోలీస్ అధికారులకు చిక్కకుండా దొంగ మార్గాల్లో వాహనాల ద్వారా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని చెబుతున్నారు. అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆ మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తే అక్రమ రవాణా బయటపడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

ఇంకా కొందరు దళారులు నేరుగా ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. కొంతమంది మధ్య దళారులను కూడా ఈ వ్యాపారంలో పాల్గొనాలని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.

చింతలపూడి, లింగపాలెం మండలాల్లో ఇప్పటివరకు అక్రమ రేషన్ బియ్యం వ్యాపారంపై ఎన్ని కేసులు నమోదయ్యాయో అధికారులు వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ బియ్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుని ఈ దందాకు అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.