Ticker

6/recent/ticker-posts

బుట్టాయగూడెంలో ఘనంగా మహిళా దినోత్సవం – 59,341 డ్వాక్రా మహిళలకు రూ.378.36 కోట్ల రుణాల పంపిణీ


బుట్టాయగూడెం, మార్చి 08: బుట్టాయగూడెం మండలంలోని జూనియర్ కాలేజ్ మైదానంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు హాజరై వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.

మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారికి మరింత బలమైన వేదికను అందిస్తోందన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాకుండా సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదిస్తున్నారని తెలిపారు.

అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచి సమాజానికి ఆదర్శంగా నిలిచిన పలువురు మహిళలను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సన్మానించారు. ఐటీడీఏ పీవో రాములు నాయక్ చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పథకాల కింద రుణాల మంజూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 59,341 మంది డ్వాక్రా మహిళలకు రూ.378 కోట్ల 36 లక్షల విలువైన రుణాల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ రుణాలు మహిళల స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల అభివృద్ధి మరియు కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి ఎంతో తోడ్పడతాయని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, ప్రతి గ్రామంలో మహిళలు సంఘటితంగా ముందుకు వచ్చి స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో రాములు నాయక్, డీడీ జగన్నాథరావు, సెర్ప్ ఏపిడి రాజబాబు, బుట్టాయగూడెం ఎంపీపీ తెల్లం రమణ, సర్పంచ్ తెల్ల వెంకయ్యమ్మ, ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరబం శ్రీనివాసులు, సాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, ఏఎంసీ చైర్మన్ పొట్ట రామారావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, జనసేన ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ పారెపల్లి రామారావు, జనసేన మండల అధ్యక్షులు మెట్ట బుచ్చిరాజు, తోట రవి, ములిసేట్టి యుగంధర్, ఏఎంసీ వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ, కూటమి నాయకులు మాదేపల్లి శ్రీనివాస్, జిఎస్ఎన్ నాయుడు, పూనెం రాజా, సొసైటీ అధ్యక్షులు సరిపెల్లి సత్యనారాయణ రాజు, దుగ్గిన శ్రీనివాస్, తీగల గోపాలకృష్ణ, ఏలేటి ఏడుకొండలు, పద్మరాజు, సోయం రమేష్ తదితర నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.