కొయ్యలగూడెం, మార్చి 08: మండలంలోని దిప్పకాయలపాడు గ్రామంలో జనసేన పార్టీలోకి ప్రజల మద్దతు రోజు రోజుకీ పెరుగుతోందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ఆదివారం దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి జనసేన పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలలో విశేష స్పందన పొందుతున్నాయని అన్నారు. పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం జనసేన పార్టీ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. పవన్ కళ్యాణ్ చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎంతో మంది యువత, ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలోకి చేరుతున్నారని చెప్పారు.
దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు జనసేన పార్టీ విధానాలపై విశ్వాసం ఉంచి పార్టీలో చేరడం పార్టీ బలాన్ని మరింత పెంచుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడున్న మహిళలతో కలిసి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, జనసేన మండల అధ్యక్షులు తోట రవి, మెట్ట బుచ్చిరాజు, టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ, కొయ్యలగూడెం సొసైటీ ప్రెసిడెంట్ దుగ్గిన శ్రీనివాస్, గొలిశెట్టి శ్రీనివాస్, దిప్పకాయలపాడు జనసేన నాయకులు మారిశెట్టి సాయి, ములకాల సురేష్, కడిమి ప్రసాద్, దేవరపల్లి విసు, మారిశెట్టి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.



.jpeg)