ఏలూరు: ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై ద్వంద్వ వైఖరితో విషం చిమ్మే విధానాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మానుకోవాలని, లేకుంటే ప్రజలు పూర్తిస్థాయిలో వ్యతిరేకించే రోజులు తప్పవని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హెచ్చరించారు. 2019 నుంచి 2024 వరకూ రాజధాని అమరావతి అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకున్నారో ప్రజలంతా గమనించారని ఆయన పేర్కొన్నారు.
ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్‌కిషోర్‌తో కలిసి బడేటి చంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణానికి పటిష్ట చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వాధినేతలు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇలాంటి సమయంలో మాజీ సీఎం జగన్ మరియు వైసీపీ నాయకులు రాక్షసుల మాదిరిగా పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ సంకుచితంగా వ్యవహరిస్తూ విషం కక్కుతున్నారని బడేటి చంటి తీవ్రంగా మండిపడ్డారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందకూడదన్నదే జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమని ఆరోపించారు.
ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల కోసం తాము చేయాలనుకున్న మంచి పనులను తప్పకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అంశంపై లోక్‌సభలో ప్రవేశపెట్టే బిల్లుకు అనుకూలమా, వ్యతిరేకమా అన్నది వైసీపీ స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలకు, నాటకాలకు తెరదించాలని ఘాటుగా సూచించారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన నాయకత్వంలో యువనేత నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు వేగంగా ముందుకెళ్తోందని బడేటి చంటి తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్‌కిషోర్ మాట్లాడుతూ, ప్రజలను మభ్యపెట్టే వైఖరిని వైసీపీ నాయకులు విడనాడాలని హితవు పలికారు. లేకుంటే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
.jfif%20(1).jpg)

.jpeg)
