ఏలూరు జిల్లా, కామవరపుకోట: మండలం ఆడమిల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ గూడపాటి కేశవరావు మానవతా సేవలకు గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పంచాయతీ పరిధిలో గత ఏడాది కాలంలో కొన్ని కుటుంబాల్లో మరణాలు సంభవించడంతో, ఈ సంక్రాంతిని సంతోషంగా జరుపుకోలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలకు ఆయన సొంత ఖర్చులతో సంక్రాంతి పిండి వంటలను అందజేశారు.
సంక్రాంతి పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో, ఆడమిల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 30 కుటుంబాలకు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పిండి వంటలు పంపిణీ చేయడం విశేషం. ఈ కార్యక్రమంతో ఆయా కుటుంబాల ముఖాల్లో ఆనందం చిగురించిందని గ్రామస్తులు తెలిపారు.
సాధారణంగా గ్రామపంచాయతీ సర్పంచ్ అనగానే వీధిదీపాల ఏర్పాటు, మురుగునీటి డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలు వంటి మౌలిక సదుపాయాలకే పరిమితమవుతారు. అయితే గూడపాటి కేశవరావు మాత్రం ఈ పనులకు మించి, ప్రతి కుటుంబంలోని వేదనను అర్థం చేసుకుని వారికి అండగా నిలుస్తూ సహాయ కార్యక్రమాల్లో ముందుండడం విశేషంగా మారిందని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
“ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా” సర్పంచ్ గూడపాటి కేశవరావు అందిస్తున్న సేవలపై ఆడమిల్లి గ్రామపంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బాధలో ఉన్న కుటుంబాలు కూడా ఆనందంగా ఉండాలన్న భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడపాటి కేశవరావుతో పాటు నియోజకవర్గ బీసీ సెల్ ప్రెసిడెంట్ జుజ్జురి బాబ్జి, పెత్తందార్ మద్దిపాటి సత్యనారాయణ, కాసనేని గోపాలరావు, గూడపాటి కృష్ణమోహన్ రావు, నల్లమిల్లి భుజంగరావు, తూంపాటి పెంటయ్య, ఎస్.కే. ఇమామ్, నల్లమిల్లి సత్యనారాయణ, వేముల సత్యనారాయణ, టోకూరి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
