Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ – 42 ఫిర్యాదుల స్వీకరణ


ఏలూరు: జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్) కార్యక్రమాన్ని ఈ రోజు, అనగా 12.01.2026 సోమవారం, ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ ఎన్. సూర్య చంద్రరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ఫిర్యాదుల స్వీకరణను పూర్తిగా పారదర్శకంగా “పేపర్‌లెస్” విధానంలో నిర్వహించడం విశేషం. ప్రజలు తమ విలువైన సమయం, డబ్బును వృథా చేయకుండా నేరుగా తమ సమీప సబ్ డివిజన్, సర్కిల్ పోలీస్ అధికారులను సంప్రదించి ఫిర్యాదులు అందించవచ్చని అదనపు ఎస్పీ అడ్మిన్ గారు తెలిపారు.

ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేయదలచిన వారు https://meekosam.ap.gov.in https://meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించారు. అలాగే ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలియజేశారు.

ఈరోజు మొత్తం 42 ఫిర్యాదులు అందగా, వాటిలో అధికంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలకు సంబంధించినవే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదనపు ఎస్పీ అడ్మిన్ గారు ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, తక్షణమే పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ చేసి నివేదికలు సమర్పించాలని క్రింది స్థాయి అధికారులకు తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా పబ్లిక్ గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ సెల్ మహిళా ఎస్ఐ వల్లి పద్మ గారు మాట్లాడుతూ, సైబర్ క్రైమ్‌లు జరిగే విధానాన్ని వివరించి, ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు సమాచారం అందిస్తే అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చుట్టుపక్కల వారికి కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరైన ఫిర్యాదుదారులకు ఏలూరు శ్రీ సత్య సాయి సేవా సంఘం వారు భోజన ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు.