కోడి పందాలు, జూదాన్ని నివారించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి డిమాండ్
ఏలూరు: ఈ సంక్రాంతి సందర్భంగా జిల్లాలో డ్రగ్స్, గంజాయిని అరికట్టాలని, కోడిపందాలు, జూదం, ఏరులై పారే మద్యాన్ని నివారించాలని, ద్వారా యువత, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వారి సంపదను రక్షించాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి నేడొక ప్రకటనలో డిమాండ్ చేశారు. స్థానిక పవర్ పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఎం. నాగమణి అధ్యక్షతన రెండో రోజు జరిగిన ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమాజాన్ని, ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు చేతులు ముడుచుకొని కూర్చుండడం వలన రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి విపరీతంగా పెరిగిపోయాయని, పండుగల సందర్భంగా కోడి పందాలు, జూదం పెట్రేగిపోతున్నాయని, నిత్యం మద్యం ఏరులై పారుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎక్కడైనా, ఎవరైనా వీటిని ప్రశ్నిస్తే వారిని హత్య చేయడానికి కూడా ఈ ముఠాలు వెనుకాడడం లేదని అందుకు నెల్లూరులోని పెంచలయ్య హత్యా సంఘటన ఉదాహరణ అని ఆయన తెలిపారు.
హై స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్స్ గంజాయి అందుబాటులో ఉండే విధంగా ఈ ముఠాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అయినా నేటికీ ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారులు, పోలీస్ యంత్రాంగం గుణపాఠం నేర్చుకోలేదని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వానికి, ఎక్సైజ్ అధికారులకు, పోలీసులకు, ప్రతినిధులకు తెలియకుండా ఈ వ్యవహారాలు నడుస్తున్నాయా అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వాలు మారుతున్న వీరు వ్యాపారాలకు అడ్డు లేకుండా పోతుందన్నారు. డ్రగ్స్ గంజాయి ముఠాలను అణిచివేసేందుకు వారిపై ఉక్కు పాదం మోపి పీడీ యాక్ట్ వంటి కఠినమైన సెక్షన్లు పెట్టి, చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ ప్రభుత్వం సమాజానికి, ప్రజలకి హాని కలిగించే వారిపై పెట్టాల్సిన సెక్షన్లను ప్రజల తరపున, ప్రజల కోసం ఉద్యమాలు చేసే వారిపై పెట్టడం బాధాకరమన్నారు.
కోడిపందాలను, జూదం అరికడతామని భోగి ముందు రోజు వరకు హడావిడి, ప్రకటనలు చేసే పోలీసు అధికారులు కోడిపుంజులను పట్టుకొని వెళ్లే సాదాసీదా వ్యక్తులపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం చేస్తారని కానీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు బరులు గీసి, వాళ్ల కనుసన్నల్లో కోట్లాది రూపాయలు చేతులు మారే విధంగా జరిగే కోడిపందాలు, జూదాల జోలికి మాత్రం వెళ్లరని ఎద్దేవ చేశారు. ఆ ప్రాంతంలో మద్యం ఏరులై పారిన పట్టించుకోరని అన్నారు.
హైకోర్టు తీర్పు ఇచ్చినా, ఆ తీర్పును ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని, అందుకు కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. పోలీసులు ముందుగా హడావిడి చేసి ఆ తరువాత చేతులు కట్టుకొని ఉండడం సరికాదని, హైకోర్టు తీర్పు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, కోర్టు తీర్పును ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంక్రాంతికి యువత భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తును కాపాడాలన్నా, రక్షించాలన్న డ్రగ్స్, గంజాయిలను అరికట్టాలని, కోడి పందాలను జూదాలను నివారించాలని ఆయన కోరారు.
అవసరమైతే వీటిని నివారించేందుకు పిడి యాక్టులు పెట్టి కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే ప్రజల జీవితాలు, ఆరోగ్యాలు బాగుంటాయని, వారి సంపద రక్షించబడుతుందని స్పష్టం చేశారు. సిపిఎం పార్టీగా కూడా ఈ సమావేశంలో వీటి నివారణకు తగు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో డిఎన్విడి ప్రసాద్, తెల్లం రామకృష్ణ, జి రాజు, కే శ్రీనివాస్, పి రామకృష్ణ, జి నరసింహారావు, ఏ ఫ్రాన్సిస్, ఎస్ మహంకాళి, ఎన్ రమణారావు, ఎన్.ఆర్ హనుమాన్లు తదితరులు పాల్గొని మాట్లాడారు.


.jpeg)
