ఆగస్టు 15 నుంచి ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన వచ్చింది
ANDHRPRADESH:ఆగస్టు 15 నుంచి ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన వచ్చింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలు ఆగస్టు 15 నుంచి ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎక్కడికైనా ఉచితంగా పర్యటించవచ్చని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూత్రప్రాయంగా ప్రకటించారు. ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పే క్రమంలో జిల్లా వరకే పరిమితి విధిస్తున్నట్లు పరోక్షంగా సీఎం వెల్లడించారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. అయితే సీఎం ప్రకటన తర్వాత విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఎన్నికల సమయంలో ఎలాంటి పరిమితి విధించకుండా ప్రకటనలు చేసిన సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విపక్షం ధ్వజమెత్తింది. దీంతో ఈ అంశంపై రాజకీయ రచ్చ ఎక్కువైంది.
జిల్లా పరిమితి లేనట్లే.
ఈ పరిస్థితుల్లో తాజాగా ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. గతంలో ఉమ్మడి జిల్లా పరిధి వరకే అంటూ ప్రకటన చేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు స్వరం మార్చి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చంటూ ప్రకటనలు చేస్తున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రులు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
జాగ్రత్త పడిన ప్రభుత్వం
సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటనతో ఈ అంశంలో ప్రభుత్వం జాగ్రత్త పడినట్లు భావిస్తున్నారు. జిల్లా పరిధికే పరిమితి విధించడం తప్పుడు సంకేతాలిస్తుందన్న కారణంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుందని అంటున్నారు. ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నంత మాత్రాన అవసరం లేకుండా మహిళలు ప్రయాణించరన్న వాదన బలంగా వినిపించిందని అంటున్నారు. జిల్లా వరకే అంటూ పరిమితి విధించడం వల్ల ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో పక్క పక్క గ్రామాలకు వెళ్లడమూ ఇబ్బందికరంగా మారుతుందన్న అంశం కూడా ప్రభుత్వ వైఖరి మారడానికి కారణమంటున్నారు. ఎలాగూ ఉచిత పథకం అమలు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకన్న కారణంగా ప్రభుత్వం తన వైఖరి మార్చుకున్నట్లు చెబుతున్నారు.
పథకం అమలుపై విస్తృత అధ్యయనం
ఉచిత బస్సు పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సు హామీ అమలు అవుతోంది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సరైన అధ్యయనం లేకుండా పథకం అమలు చేయడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తినట్లు చెబుతున్నారు. వీటి నుంచి బయటపడటానికి ఆయా ప్రభుత్వాలు అపసోపాలు పడ్డాయని అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి మంచి కన్నా చెడ్డ పేరు ఎక్కువ వచ్చిందన్న అభిప్రాయమూ ఉంది. ఈ పరిస్థితుల్లో తాము కూడా తొందరపాటుతో ఉచిత బస్సు అందుబాటులోకి తెస్తే దెబ్బతింటామన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా ఆలోచించి, అన్ని రకాల సమస్యలపై అధ్యయనం చేసిన తర్వాతే ఈ పథకం అమలు చేయనున్నారని చెబుతున్నారు. పథకం సాఫీగా అమలు అయ్యేందుకు మూడు రకాల ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తేనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై మరింత చర్చ జరగనున్నందున ఆ వివరాలను బయట పెట్టడం లేదని అంటున్నారు. కానీ, విపక్షం సృష్టిస్తున్న గందరగోళం నుంచి బయటపడేందుకు ముందుగా జిల్లా పరిమితి లేదన్న ప్రకటన విడుదల చేసిందని అంటున్నారు.
Social Plugin