ANDHRAPRADESH:ఏపీలో కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీ4 పథకంలో చేరి బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకోమని ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగుల్ని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చాలీ చాలని జీతాలతో బతుకుతున్న తమను ఇలా ఒత్తిడి చేయడం తగదని వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ దీనిపై స్పందించింది. పీ4 పథకంలో ఒత్తిళ్లపై స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో పీ4 పథకం అమలు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లూ లేవని కుటుంబరావు వెల్లడించారు. ఈ పథకం సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్న వారు స్వచ్ఛందంగా అట్టడుగునున్న కుటుంబాలు, వ్యక్తులు, గ్రామాల అభివృద్ధిలో తోడ్పడే అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. సమాజంలో ఆర్థికంగా బలంగా ఎదిగారో, వారు అట్టడుగున ఉన్న బడుగు వర్గాలకు సహాయం అందిస్తే అసమానతలు తొలగుతాయని, సమాజంలో సమానత్వం నెలకుంటుందని ఆయన తెలిపారు. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం సర్వే నిర్వహించి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాల్సిన కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించిందన్నారు.
అలాగే సహాయం చేయగల సామర్థ్యం ఉన్నవారిని మార్గదర్శకులుగా గుర్తించి నమోదు చేసిందని కుటుంబరావు తెలిపారు. ఈ పథకం పూర్తిగా వాలంటరీ, అంటే స్వచ్ఛందమే అన్నారు. ఎవరూ ఎవరినీ బలవంతంగా ఇందులో చేర్చడం లేదన్నారు. ఇటీవల కొన్ని విపక్షాలు, కొంతమంది వ్యక్తులు పీ4 పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జిల్లా విద్యాశాఖాధికారి హెడ్ మాస్టర్లు, టీచర్లను మార్గదర్శకులుగా నమోదు చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు అవాస్తవం అన్నారు. దీనిపై అధికారికంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఇష్టమైన వారు మాత్రమే ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చన్నారు.
ఇలాంటి మంచి కార్యక్రమంలో అవాస్తవాలకు తావు ఇవ్వొద్దని, ఎవరైనా బలవంతం చేస్తే, దయచేసి సంబంధిత అధికారులకు లేదా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వగలరని కుటుంబరావు సూచించారు. ఇప్పటికే 50,000 మందికి పైగా మార్గదర్శకులు స్వచ్ఛందంగా నమోదు అయ్యారని, 6 లక్షల బంగారు కుటుంబాలు గుర్తించామని ఆయన తెలిపారు. మార్గదర్శకులు కూడా వారిని దత్తత తీసుకొంటున్నారన్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు 250 కుటుంబాలను దత్తత తీసుకొని పీ4 పథకానికే ఆదర్శంగా నిలిచారన్నారు. పీ4 పథకంలో పాల్గొంటున్న ప్రభుత్వాధికారులు కూడా దీన్ని వాలంటరీ ప్రోగ్రామ్‌గా మాత్రమే చూడాలని, ఎటువంటి బలవంతం లేకుండా పని చేయాలని స్పష్టం చేశారు.
Social Plugin