HYDERABAD:తెలంగాణలో జరిగిన గొర్రెల స్కాం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో గొర్రెల పంపిణీ పథకం పేరిట వేల కోట్ల రూపాయలు నల్లధనంగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రూ.700 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు అవినీతి నిరోధక శాఖ (ACB) గుర్తించగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగిస్తుంది.
హైదరాబాద్‌లో 10 చోట్ల ఈడీ సోదాలు..
ఈ క్రమంలోనే ఈడీ ఈరోజు ( జూలై 30, 2025 ) హైదరాబాద్ లోని సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. సుమారు ఆరు నుంచి పదివరకు ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నట్టు సమాచారం.
కాగా ఈ లిస్టులో పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ సహా పలువురు అధికారుల ఇళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఆధారాలను సేకరించిన అధికారులు మనీ లాండరింగ్‌లో వాడిన ఖాతాలు, నకిలీ బిల్స్, పథకానికి సంబంధించిన చెల్లింపుల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో ఏసీబీ కేసు..
ఈ స్కాం మొదటగా ఏసీబీ దృష్టికి రావడంతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. రూ.4,000 కోట్ల విలువైన గొర్రెల పంపిణీ పథకం కింద జరిగిన ఖర్చుల్లో రూ.700 కోట్లు అక్రమ లావాదేవీలకు దారి తీయడంపై విచారణ జరుపుతున్నారు. 2015లో ప్రారంభమైన ఈ పథకంలో వేలాది లబ్ధిదారులకు గొర్రెలు అందించామంటూ రికార్డులు ఉన్నప్పటికీ.. చాలా మందికి పంపిణీ మాత్రం కేవలం రికార్డులకే పరిమితమైందని తెలుస్తోంది.
రాజకీయ నేతల పాత్రపై అనుమానాలు
ఈ కుంభకోణంలో అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్రపై అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా స్కామ్‌లో నకిలీ పేర్లతో వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వెళ్లినట్లు కాగితాలపై చూపించి, వాస్తవంగా వాటిని బినామీ ఖాతాల్లోకి మళ్లించిన విధానం ఈడీ దృష్టికి వచ్చింది. ఇప్పటివరకు చాలా ఖాతాలపై స్టేట్మెంట్లు, లావాదేవీల రికార్డులు సేకరించిన అధికారులు, వాటిని ఫోరెన్సిక్ ఆడిట్‌కు పంపించారు.
Social Plugin