AMARAVATHI: వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి.. కొన్నాళ్ల కిందట కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్న మద్యం కుంభకోణం విచారణకు వచ్చిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ``నేనేంటో చూపిస్తా. అందరినీ బయటకు లాగుతా. నేను ఇప్పటి వరకు మౌనంగా ఉన్నా. ఇక, నుంచి నేనేంటో తెలుస్తుంది. తెలిసేలా చేస్తా`` అని వ్యాఖ్యానించారు. ఆయన అలా అని నెల రోజులు కూడా కాకముందే.. అనూహ్యంగా మద్యం కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది.
ఇలా ఈడీ నేరుగా ఎంట్రీ ఇవ్వడం అనేది దాదాపు ఉండదు. కానీ, జరిగింది. తాజాగా మద్యం కుంభకోణంలో జరిగినట్టుగా భావిస్తున్న మనీలాండరింగ్ వ్యవహారాన్ని తాము తేలుస్తామని ఏపీ అధికారులకు లేఖ రాసింది. అయితే.. ఇలా ఈడీ ఎంట్రీ ఇవ్వడం వెనుక.. సాయిరెడ్డి ఉన్నారన్న చర్చ సాగుతోంది. ``కొందరు మనపై పగబట్టారు. వారి విషయంలోనూ మనం జాగ్రత్తగా వ్యవహరించాలి`` అని జగన్ చెప్పడాన్ని బట్టి.. ఆయన ఉద్దేశం సాయిరెడ్డేనని తెలుస్తోంది.
సాయిరెడ్డికి కేంద్రంతో ఉన్న సంబంధాలు.. రాజకీయ అనుబంధాల గురించి తెలియంది కాదు. ఆయన గతంలో కేంద్రంలోని పెద్దలతో బాగానే టచ్‌లో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వైసీపీ ఆయనను బద్నాం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ మీడియాలో సాయిరెడ్డిపై వచ్చిన కథనాలపై ఆయన ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ముల్లును ముల్లుతోనే తీయాలని భావించడం.. రాజకీయాల్లో నాయకులకు కొత్తకాదు.
ఇదే సాయిరెడ్డిని ఈడీకి లేఖ రాసేలా చేసిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. దీనిపై ఎవరూ పెదవి విప్పడం లేదు. ``సాయిరెడ్డి లేఖ రాసి ఉండకపోతే.. ఈడీ ఇప్పుడు ఉన్నపళంగా ఏపీ విష యంపై జోక్యం చేసుకునే అవకాశం లేదు`` అని టీడీపీ నాయకుడు ఒకరు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. ప్రభుత్వం కానీ.. మద్యం కేసును విచారిస్తున్న ఏపీ అధికారులు కానీ.. ఈ కేసులో ఈడీ జోక్యం కోరుతూ.. ఇప్పటి వరకు లేఖ రాయలేదు. కనీసం సంప్రదించలేదు. ఈ పరిణామంతో సాయిరెడ్డి తన విశ్వరూపం చూపించే క్రమంలో అందివచ్చిన అవకాశం వినియోగించుకున్నారని మాత్రం టాక్ వినిపిస్తోంది.
Social Plugin