ANDRAPRADESH, WEST GODAWARI: వ్యవసాయం అంటే విత్తనం అలికినప్పటి నుంచి పంట కోసి అమ్మేవరకు.. అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవాల్సిందే. చీడపీడలు, వర్షాలు, ఎండలు.. ఇలా అనేక సమస్యలను తట్టుకుని.. పంట పూర్తయ్యేవరకు ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం.. ఒకవైపు పార్టీ, ప్రభుత్వం, రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా ఉంటూనే.. మరోవైపు.. తన పొలంలో వరి ధాన్యం అధిక దిగుబడిని సాధించి ఆదర్శ రైతు అనే పేరు తెచ్చుకున్నారు. దీంతో వ్యవసాయ శాఖ నుంచి మంత్రి నిమ్మలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన సొంత పొలంలో దాళ్వా వరి సాగు చేసిన మంత్రి నిమ్మల ఎకరానికి ఏకంగా 65 బస్తాల ధాన్యాన్ని పండించారు.
తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడిని మంత్రి నిమ్మల సాధించారు. వ్యవసాయ అధికారుల సూచనలతో స్వయంగా వ్యవసాయ పనుల్లో పాల్గొని.. పంట యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు తీసుకున్నారు. సకాలంలో నారు నాటడం, ఎరువులు, నీటి యాజమాన్యం, పురుగు మందుల వాడకం, నీటి ఎద్దడి నివారణ వంటి చర్యలతో ఎకరానికి 65 బస్తాల ధాన్యాన్ని పండించినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడును ఆదర్శ రైతుగా వ్యవసాయ శాఖ అభినందించింది.
దాల్వా రకం వరి పంటను సాగు చేసిన మంత్రి నిమ్మల.. ఎకరానికి 65 బస్తాల దిగుబడులు సాధించినట్లు పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకురాలు అద్దాల పార్వతి, పాలకొల్లు మండల వ్యవసాయ అధికారి కే రాజశేఖర్ తెలిపారు. పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. పాలకొల్లు మండలం ఆగర్తి పాలెం గ్రామంలో మంత్రి రామానాయుడు తన 6 ఎకరాల విస్తీర్ణంలో పీఆర్ 126 సన్నరకం (గ్రేడ్ A) దాళ్వా రకం వరి పంటను సాగు చేశారు. ఎకరానికి 65 బస్తాలు చొప్పున 6 ఎకరాల్లో 390 బస్తాలు దిగుబడి సాధించారు.
ఎమ్మెల్యేగా ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధితోపాటు.. మరోపక్క కీలకమైన జల వనరుల శాఖ మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొద్దిపాటి సమయం దొరికినప్పుడల్లా పొలంకి వెళ్లి స్వయంగా వ్యవసాయ పనులు చేశారు. నాట్లు వేయడం దగ్గర నుంచి కలుపు తీయడం, ఎరువులు వేయడం, పురుగు మందులు చల్లడం ఇలా ప్రతి పనిలోనూ వ్యవసాయ కూలీలతో కలిసి మంత్రి నిమ్మల పనిచేశారు. ముఖ్యంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ అధిక దిగుబడులతో మంచి ఫలితాలు సాధించారు.
Social Plugin