ANDRAPRADESH, WEST GODAWARI, TADEPALLIGUDEM: పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో ఉన్న కొంతమంది నాయకులే తాను చనిపోవాలని కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే ఉప ఎన్నిక వస్తుందని.. అప్పుడు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారని, ఇది చాలా బాధకరమైన విషయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తానేమీ వైసీపీ ఎమ్మెల్యేను కాదన్న బొలిశెట్టి శ్రీనివాస్.. తాను ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేనని చెప్పారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తనకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని.. ప్రజలు ఆశీర్వదించి నియోజకవర్గం చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించారని గుర్తుచేశారు.
ఎవరి త్యాగాల వల్ల తనకు ఎమ్మెల్యే సీటు రాలేదన్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. మూడు పార్టీలు కలిపి తనకు విజయాన్ని కట్టెబెట్టాయన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నానని చెప్పారు. కొంతమంది అధికారులను ఇబ్బంది పెట్టి, బెదిరించాలని చూస్తున్నారని, అలాంటి పనులను సహించేది లేదని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అధికారులను కాపాడుకోవటం ఎమ్మెల్యేగా తన బాధ్యత అని చెప్పారు.
కొంతమంది తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మరో పిఠాపురం చేస్తామని అంటున్నారని.. తానేమీ చేతులకు గాజులు తొడుక్కుని కూర్చోలేదంటూ బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్థలాలు, పొలాలు పూడ్చలేదని.. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం పనిచేస్తున్నానని చెప్పారు. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా తాను ఇబ్బంది పెట్టడం లేదని.. ఎమ్మెల్యేగా తనకు గౌరవం ఇవ్వాలని కోరారు.
మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.1981లో యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1999లో తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా బొలిశెట్టి శ్రీనివాస్ పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన బొలిశెట్టి శ్రీనివాస్.. 2014 నుంచి 2019 వరకు మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు.
2019లో జనసేన పార్టీలో చేరి.. తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో తాడేపల్లిగూడెం సీటు జనసేనకు దక్కింది. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై 62492 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు.
Social Plugin