Ticker

6/recent/ticker-posts

సేవాభావం గల వ్యక్తులందరూ రెడ్ క్రాస్ సంస్థలో జీవితకాల సభ్యత్వం పొందాలి: డాక్టర్ మాగంటి ప్రసాద్


ఏలూరు: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవం వేడుకలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ మాగంటి ప్రసాద్ తెలిపారు. ముందుగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ విగ్రహానికి డాక్టర్ మాగంటి ప్రసాద్, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


ఈ సందర్భంగా డాక్టర్ మాగంటి ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న అతిపెద్ద మానవతావాద సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ అని, సుమారు 1 కోటి 60 లక్షల మంది రెడ్ క్రాస్ వాలంటీర్లు, సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. జిల్లాలోని రెడ్ క్రాస్ సేవలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సహకారంతో మరింత విస్తృతం చేస్తామని, ప్రతి మండలంలోనూ రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ లను ఏర్పాటు చేస్తున్నామని, తల సేమియా సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి చిన్నారులకు అవసరమైన రక్త పరీక్షలను రెడ్ క్రాస్ ల్యాబ్ లో చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 

బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలను పెంచి తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా చిన్నారులకు ఎక్కువ మందికి రక్త మార్పిడి జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేలా 2025 - 26 సంవత్సరంలో పాఠశాలలో మరియు కళాశాలల విద్యార్థులను పెద్ద ఎత్తున జూనియర్, యూత్ రెడ్ క్రాస్ విభాగాలలో నమోదు చేయిస్తామన్నారు. యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లకు ప్రధమ చికిత్స, విపత్తుల నిర్వహణ మీద శిక్షణను ఇచ్చి వారిని వరదలు సంభవించినప్పుడు సహాయక చర్యల్లో భాగస్వాములను చేస్తామని అన్నారు. 

సేవాభావం గల వ్యక్తులందరూ రెడ్ క్రాస్ సంస్థలో జీవితకాల సభ్యత్వం పొందాలని కోరారు.   అనంతరం బ్లడ్ సెంటర్లోని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి,  రెడ్ క్రాస్ వాలంటీర్లతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఫైర్ స్టేషన్ మీదగా రెడ్ క్రాస్ మరియు తల సేమియా వ్యాధిపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. రెడ్ క్రాస్ రక్తమార్పిడి కేంద్రంలోని రక్త మార్పిడి చికిత్స పొందుతున్న 15 మంది తలసేమియా చిన్నారులకు పండ్లను మరియు ప్రోటీన్ పౌడర్లను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జె.సత్యనారాయణ రాజు, ట్రెజరర్ ఎన్.బ్రహ్మానందం, డాక్టర్ వరప్రసాదరావు, కమిటీ సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు, మునగాల మురళీకృష్ణ, ఎంవివి నాగేశ్వరరావు, మోటేపల్లి చంద్రశేఖర్, మేతర అజయ్ బాబు, కొత్తగుండు శ్రీనివాస్, పెనుమత్స శ్రీరామరాజు, బొల్లా లక్ష్మీనారాయణ, మానవత సభ్యులు,  రెడ్ క్రాస్ ఏఎన్ఎం విద్యార్థినీలు,  సిఆర్ రెడ్డి ఫార్మసీ, మరియు నర్సింగ్ విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.