ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శరణి రచించిన 'మైండ్ సెట్ షిఫ్ట్' పుస్తకావిష్కరణ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవిలు ముఖ్య అతిథులుగా హాజయ్యారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ఒక మహానాయకుడు.. విద్యార్థి దశ నుంచే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప నాయకుడు అయ్యారన్నారు. చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తుంది.. ఆయన హైదరాబాద్ పయనీర్ అంటూ పొగడ్తలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ధీరోదాత్తుడని.. 2003లో అలిపిరి దాడి ఘటనలో పడిలేచిన ఆయనలో ఎంతో మానసిక స్థైర్యం చూశానని కొనియాడారు.
'అలిపిరి సంఘటనతో చంద్రబాబు కిందపడి లేచారు.. అంతటి పరిస్థితిలోనూ ఎక్కడా చెక్కు చెదరలేదు. ఎంతో మానసిక స్థైర్యంతో ఉన్నారు. అంతటి ధీరోదాత్తత చంద్రబాబులో చూశాను. ప్రతికూల పరిస్థితులు వచ్చినా.. వాటిని అధిగమించేలా మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ముందుకు వెళ్లాలి. అందుకు నిదర్శనమే చంద్రబాబు. ఆయన తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగంలో రాణించాలనే తపించారు. కాలేజీ రోజుల నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగారు.. రాష్ట్రానికి సేవ చేయాలనే దీక్షతో నడిచారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఎదిగారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందింది. ఈరోజు ఐటీ, డిజిటలైజేషన్, ఏఐ స్థాయికి చేరడానికి.. మార్గదర్శకుడు చంద్రబాబు'అంటూ ప్రశంసించారు.
'ప్రతి ఒక్కరూ జీవితంలో మీమాంస పడకుండా.. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. పాజిటివ్‌గా ఆలోచన చేయాలి.. చంద్రబాబు గారి మైండ్ సెట్ ఎప్పుడూ నాయకత్వ లక్షణాలతో ఉంటుంది. ఆయన ప్రజలకు, రాష్ట్రానికి ఏమి చేయాలనే ఆలోచనతో ఉంటారు. రాజకీయాల్లో చంద్రబాబు, సినిమాల్లో నేను రాణించామంటే పాజిటివ్ ఆలోచన, మైండ్‌సెట్ కారణం. చంద్రబాబు మహా నాయకుడిగా ఎదిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఇలాంటి నాయకుల మైండ్ సెట్ మనకు ఆదర్శం కావాలి. జీవితం ఏమవుతుందో అనే అభద్రతాభావంతో ఉండే కంటే.. నేను సాధించగలనని మైండ్ సెట్ చేసుకుని ఎక్కువ దృష్టి పెట్టాలి. నేను అక్కడే సఫలీకృతుడిని అయ్యాను. వ్యక్తిత్వం, ప్రవర్తన, మంచితనం.. అనేవి అదనపు ఆకర్షణలు. అత్యున్నత స్థానానికి వెళ్లినా నడత సరిగా లేకుంటే గుర్తింపు ఉండదు. మైండ్ సెట్‌కు షిప్ట్ అనేది చాలాచాలా అవసరం’ అన్నారు.
‘ఎవరి జీవితం పూలపాన్పు కాదు. ప్రతిచోటా ఆటంకాలు వస్తుంటాయి. అయినా విజయం అందుకోలేక తప్పెక్కడ? అనుకుంటాం. మన ప్రయాణంలో ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి. డిస్ట్రక్షన్, డిజప్పాయింట్‌మెంట్ వస్తుంటాయి. మిమ్మల్ని డీ మోటివేట్ చేసే వాళ్లుంటారు. ఇలాంటి ఎన్ని ‘డి’లు ఉన్నా.. వాటిని ‘ఢీ’కొట్టాలంటే డిటర్మినేషన్ ఎంతో ముఖ్యం. ఎక్కడా బెదరకూడదు. చాలామందికి మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు. గురువులు చెప్పడం లేదు. ఒకేలా కష్టపడుతూ గానుగెద్దులా జీవితం వెళ్లదీస్తారు. ఏదో సమయంలో పదవీ విరమణ చేస్తారు. ఈ జన్మకు ఇది చాలు అనుకుంటూ జీవితం చాలిస్తారు. అది సరైంది కాదు. ఆలోచన విధానం మార్చుకుని.. కష్టపడే మనస్తత్వంతో ఇష్టమైన ప్రొఫెషన్‌లో ఉంటే ఒక స్థాయిలో రాణించవచ్చు' అన్నారు.
'శరణి పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది. గతంలో సీక్రెట్ అనే బుక్ నాకు ఎంతో నచ్చింది. ఇప్పుడు శరణి రాసిన పుస్తకం కూడా అందరకీ ఉపయోగకరంగా ఉంది. ఎంతోమంది కష్టం వచ్చిన వెంటనే కుంగి పోతుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మనకు నచ్చిన రంగంలో రాణించాలంటే పాజిటివ్ అలోచన ఉండాలి. రాత్రి కాలేజ్లో చదువుకున్నా. చదువు వదిలి సినిమాలే నా జీవితం అనుకుని ధైర్యంగా ముందుకు వెళ్లా. ఆ తరువాత అందరి చేతా వావ్ అనిపించుకున్నా. నేడు ఇన్నికోట్ల మంది అభిమానం సంపాదించా. మన మైండ్ మనకు ఏది మంచిదో చెబుతుంది' అన్నారు మెగాస్టార్.
Social Plugin