ANDRAPRADESH: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారం అందుకోవాలని చూస్తున్నారు. ఆయన వయసు ఇపుడు 50 ప్లస్ లో ఉంది. రాజకీయంగా యువకుడి కిందనే లెక్క. ఇక ఆయన 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయినా 2029 నాటికి తిరిగి అధికారం అందుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. పడి లేచిన కడలి తరంగం మాదిరిగా ఆయన తన సత్తాను చూపించాలని అనుకుంటున్నారు. దాని కోసం ఆయన పాత ఫార్ములాను కొత్తగా వాడాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ అన్ని వర్గాల ప్రజలతో మమేకం అయ్యారు. మరో వైపు పార్టీ ఆయనకు అండగా నిలిచింది.
క్యాడర్ లీడర్ అంతా జగన్ నామస్మరణతో తరించారు. ఇక కోస్తాలో టీడీపీని నిర్వీర్యం చేయడానికి జగన్ సామాజిక సమీకరణలను కూడా వాడారు. గోదావరి జిల్లాలలో బలమైన సామాజిక వర్గాన్ని దగ్గరకు తీయడం వారి విశ్వాసాన్ని చూరగొనడంలో నూరు శాతం సక్సెస్ అయ్యారు. అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలలో బీసీలను కూడగట్టి ఆ విధంగా ఈ రీజియన్ ని స్వీప్ చేశారు. ఆనాడు జగన్ కి కలసివచ్చిన అంశం సామాజిక సమీకరణలు. సోషల్ ఇంజనీరింగ్ గా కూడా దీనిని పేర్కొనాలి. అలా జగన్ అన్ని వర్గాల మద్దతుతో 2019 ఎన్నికల్లో 151 సీట్లను సాధించారు. అయితే ఈసారి అదే ఫార్ములాకు కొత్త టచ్ ఇచ్చి జనంలోకి రావాలని చూస్తున్నారు.
ఈ రోజు టీడీపీకి మెజారిటీ వర్గాలు సహకరిస్తున్నాయి. కాపులు బీసీలు ఇతర వర్గాలు అగ్ర వర్ణాలు అందరూ మద్దతుగా ఉన్నారు. దాంతో ఈ వర్గాలలో వైసీపీ పట్టు పెంచాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. కాలం ఎపుడూ ఒకేలా ఉండదు కాబట్టి 2029 నాటికి ఆయా వర్గాలు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో తమ వైపు వస్తాయని జగన్ అంచనా వేస్తున్నారు. ఇక పార్టీలో సీనియర్లకు పెద్ద పీట వేస్తున్నారు.
వారికి స్వేచ్చ ఇస్తున్నారు. మీరు నిర్ణయాలు సమయానికి సందర్భానికి తగినట్లుగా తీసుకోండి, ఎవరి ఆదేశాల కోసమో చూడవద్దు అని కూడా జగన్ చెప్పుకొచ్చారు. ఆ విధంగా వారికి అగ్ర తాంబూలం ఇస్తూనే జిల్లాల అధ్యక్షులను కూడా నియమిస్తున్నారు. అలాగే నియోజకవర్గాల స్థాయిలో ఇంచార్జిలను కూడా సమర్ధులను తీసుకోవాలని చూస్తున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే జనంతో మమేకం కావడానికి జగన్ చూస్తున్నారు. అలాగే పార్టీ క్యాడర్ కోసం కూడా కొంత సమయం ప్రతీ రోజూ కేటాయించాలని ఆయన ఆలోచనలు చేస్తున్నారు. పార్టీలో క్యాడర్ కి ఎంత ఎక్కువగా టచ్ లో ఉంటే అంతలా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ నిఖార్సు అయినది తనకు వస్తుందని ఆయన ఆలోచిస్తున్నారు. ఇక జూన్ తరువాత నుంచి జనంలోకి జగన్ వెళ్తారు అని ప్రచారం సాగుతోంది. జగన్ లో ఒక టెక్నిక్ ఉంది. ప్రజలతో ఎలా కనెక్ట్ కావాలో ఆయనకు బాగా తెలుసు. అది 2019 ఎన్నికలకు ముందు ఆయన బాగానే ఉపయోగించారు.
ఇపుడు కూడా జనం వద్దకు వెళ్ళడం పేదల ఇళ్ళలో గడపడం రైతులతో పొలాలకే వెళ్ళి ముచ్చటించడం ఇలా వివిధ వర్గాలను కలుపుకుని పోవాలని చూస్తున్నారు. మొత్తానికి కూటమికి ఏడాదికి పైగా సమయం ఇచ్చిన జగన్ జనంలోకి మంచి ముహూర్తం చూసి రావాలని అనుకుంటున్నారుట, ఈ లోగా పార్టీకి చేయాల్సిన రిపేర్లు అన్నీ పూర్తి చేస్తారు అని అంటున్నారు. సో జగన్ పాత ఫార్ములను కొత్తగా ఎలా అమలు చేయబోతున్నారు అన్నది చూడాల్సిందే.
Social Plugin