ఏలూరు: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తియ్యేవరకు అత్యంత అప్రమత్తతతో లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కౌంటింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులు, పర్యవేక్షణ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్ధానిక కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో విధులు కేటాయించిన ఓట్ల లెక్కింపు సిబ్బంది, టేబుల్ సూపర్ వైజర్లు, రోల్ ఇన్ చార్జ్ లు, పర్యవేక్షణ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ లెక్కింపులో పూర్తి ఏకాగ్రతతో కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. బ్యాలెట్ బాక్సులు తెరిచే సమయంలో, బండ్లింగ్ చేయుట, లెక్కించుట ప్రక్రియల నిర్వహణలో ఎన్నికల కమీషన్ నిర్ధేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపరు, మొదటి ప్రాధాన్యత ఓటు, నమోదు విధానం ద్వారా జరుగుతున్న నేపద్యంలో ఓట్లలెక్కింపు చాలా జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి 456 పోలింగ్ బూత్ ల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్లు లెక్కింపుకు 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రతీ టేబుల్ కు కౌంటింగ్ సిబ్బందితో పాటు టేబుల్ సూపర్ వైజర్, రోల్ ఇన్ చార్జి, షిఫ్టు ఇన్ చార్జి లతోపాటు మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు సమయంలో పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన విధానాలపై ఇప్పటికే శిక్షణా తరగతులు నిర్వహించుకున్నామని, దానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఈనెల 3వ తేదీన ఏలూరు సర్. సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే ఓట్ల లెక్కింపు విధులకు షిఫ్టుల వారీ 700 మంది సిబ్బందిని నియమించామని సోమవారం ఉదయం షిప్టుకు కేటాయించిన సిబ్బంది ఉదయం 6.30 గంటల ఖచ్చితంగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు.
Social Plugin