Ticker

6/recent/ticker-posts

వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి


ఏలూరు: జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో జిల్లాలో వరద పరిస్థితిపై మంత్రి పార్థసారథి టెలిఫోన్ ద్వారా  వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గేవరకూ కాజ్ వే, కల్వర్టుల వద్ద వాహనాలు, ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలనీ,  సిబ్బందిని కూడా  నియమించాలన్నారు.

లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను పునవారస కేంద్రాలకు తరలించి, భోజన, వసతి సదుపాయాలు కల్పించాలన్నారు. పునవారస కేంద్రాల పరిసరాలు, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాల్లోని వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.  భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టిందని, అయినప్పటికీ వరద ప్రమాదం పూర్తిగా తొలిగిపోయే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

తమ్మిలేరు, కొల్లేరులలో వరద ఉధృతి ఎక్కువగా ఉందని, ఆయా గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వరద ప్రమాద ముంపు తొలగే వరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, వరదల కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి పార్థసారథి చెప్పారు