వరద పరిస్థితిపై సమీక్షించిన ముఖ్యమంత్రి
ఏలూరు ప్రతినిధి: వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమకు వరాలు కురిపించారు. బుధవారం ఏలూరు వచ్చిన ముఖ్యమంత్రికి సిఆర్ఆర్ కళాశాలలోఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
ఏలూరు కొత్త బస్ స్టాండ్ సమీపంలోని తమ్మిలేరు బ్రిడ్జిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మంత్రులు, ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులతో కలసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ తో వరద పరిస్థితులపై సమీక్షించిన ముఖ్యమంత్రి తిరిగి సిఆర్ఆర్ కళాశాలలో ముంపు ప్రభావిత ప్రాంతాల రైతులు, అధికారులతో కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై సమీక్షించారు. వివిధ శాఖల అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలను ఉప్పుటేరు వరదపై లైవ్ టెలీకాస్ట్ ను ముఖ్యమంత్రి వీక్షించారు. ఆయన మాట్లాడుతూ అందరికీ అండగా ఉంటామన్నారు. తరచుగా ముంపుకు గురి అవుతున్న ఏలూరు శనివారపుపేట కాజ్- వే స్థానంలో రూ. 15 కోట్లతో నూతన వంతెన నిర్మాణం తక్షణం చేపడతామన్నారు. ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణాన్ని చేపడతామన్నారు.
ఆకివీడు వద్ద ఉప్పుటేరుపై నిర్మించిన రెండో రైల్వేలైను ఉప్పుటేరు ప్రవాహానికి ఆటంకంగా ఉన్న పరిస్థితులను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. వరి రైతులకు పంట నష్టపరిహారాన్ని హెక్టార్ కు రూ. 17 వేల నుండి 25 వేలకు పెంచుతామన్నారు. గత ప్రభుత్వం చేసిన పాపాలు శాపాలుగా మారాయని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్సించారు. పోలవరం మన రాష్ట్రానికి వరం అని సిఎం అన్నారు. ఓట్లు వేశాము గెలిపించాము అక్కడికి మా పని అయింది అంటే కుదరదని ప్రభుత్వాన్ని నడిపించుకొని భాధ్యత ప్రజలదే నన్నారు. నూటికి డబ్బయైమంది కౌలు రైతులు ఉన్నారు. త్వరలో నీటి సంఘాల ఎన్నికలు జరిపి డ్రైన్లు కాలువలు పూడిక తీయిస్తామన్నారు. రాత్రి, పగళ్ళు మీ కోసం కష్టపడి పనిచేస్తాను అని తెలిపారు.
Social Plugin