ఏలూరు - ప్రతినిధి: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని అట్లాంటా నగరంలో అమెరికా తెలుగు సంఘం ఆటా ఆధ్వర్యంలో సాంస్కృతిక సంబరాలు ఘనంగా నిర్వహించినట్టు కళారత్న కె.వి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు అమెరికా నుంచి ఇక్కడి మీడియాకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ వివరాలు తెలిపారు. అమెరికా తెలుగు అసోసియేషన్ వారు ఆటా సాంస్కృతిక మహోత్సవాల్లో కూచిపూడి ప్రదర్శన కోసం ప్రత్యేక ఆహ్వానితులు కె.వి సత్యనారాయణను ఆహ్వానించినట్టు పేర్కొన్నారు.
ఆటా నిర్వహించిన "సయ్యంది పాదం" శాస్త్రీయ నృత్యాల పోటీలకు న్యాయ నిర్ణేతగా సత్యనారాయణ వ్యవహరించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వివిధ నగరాలలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీలలో గెలుపొందిన వారిలో ఫస్ట్, సెకండ్, ఫైనల్స్ కోసం అట్లాంటాలో ప్రదర్శన ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.వి సత్యనారాయణ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
అట్లాంటాలోని స్థానిక నృత్య కళాకారులతో గోదా కళ్యాణం కూచిపూడి నృత్య రూపకాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. ఆటా తరఫున కన్వీనర్ ఆటా సభ్యులు కే.వీ సత్యనారాయణను ఘనంగా సన్మానించారు.. వేల మంది తెలుగువారు ఈ సభలకు విచ్చేసి జయప్రదం చేశారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కవులు, గాయకులు, నృత్య కళాకారులు, ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Social Plugin