Ticker

6/recent/ticker-posts

మున్సిపాలిటి బోర్డు ధ్వంసం చేసిన 7గురిపై కమీషనర్ ఫిర్యాదు


జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ కార్యాలయం బోర్డు ధ్వంసం చేసిన ఘటనలో ఏడు గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని కమిషనర్ ఎన్. నరేంద్ర కుమార్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయం బోర్డు మీద ఉన్న అక్షరాల్లో డాక్టర్ వై ఎస్సార్ రాజశేఖర్ రెడ్డి అనే వాటిని తెలుగుదేశం పార్టీ నేతల ప్రత్యక్ష పర్యవేక్షణలో ధ్వంసం చేసారు. దీనిపై తెలుగుదేశం, వైసిపి మధ్య మాటలు యుద్ధం మొదలైంది.


వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజుల్లో ప్రజావేదికను కూల్చటం ఎంత వరకు వెళ్ళిందో తెలిసిందే.. ప్రస్తుతం కూడా వివాదం కూల్చివేత తోనే ఆరంభం అయినట్టు కనిపిస్తుంది. ఈ మేరకు వైసిపినేతలు నిరసన తెలుపుతూ సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘ కార్యాలయంపై ఉన్న బోర్డులో వైఎస్సార్ పేరును తొలగిస్తే ఏమిలాభం ఆయన ప్రజల మనిషి అని వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన కంభం విజయరాజు అన్నారు. చైర్ పర్సన్ బత్తిన లక్ష్మీ, వైస్ చైర్మన్ ముప్పిడి అంజి, జెట్టి గురునాధ రావు, జెడ్పిటిసి పొలీనాటి బాబ్జి, మండ వల్లి సోంబాబు, ముప్పిడి శ్రీనివాసరావు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

దీనిపై తెలుగుదేశం నాయకుడు చెరుకూరి శ్రీధర్ అభ్యంతరం తెలిపారు. వైసిపి కార్యకర్తలు సమావేశం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. అధికారులు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయానికి గతంలోనే ఎన్టీఆర్ పేరు పెట్టారని దాన్ని కాదని వైఎస్ పేరు పెట్టడంతో దాన్ని తొలగించారని పేర్కొన్నారు. ఏదయినా ఉంటే కౌన్సిల్ చూసుకోవాలని ఓడి పోయిన వైసీపీ నాయకులు రావడం ఏమిటని ప్రశ్నించారు.