Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పెంపుకు రంగం సిద్దమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన పెన్షన్ల పెంపు హామీ, కొత్తగా పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా అధికారులు ప్రస్తుతం పెన్షన్లు ఎవరెవరు అందుకుంటున్నారు, వారిలో అర్హులు ఎవరు, పెన్షన్ల పెంపు ఎవరెవరికి వర్తింపచేయాలి, 50 ఏళ్ల పైబడిన వారికి ఇస్తామని ప్రకటించిన హామీపై ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు పూర్తి కాగానే ఈ వివరాలను అందించి దీనిపై కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ సహా కూటమి నేతలు జూలై 1 నుంచి పెన్షన్లను పెంచడంతో పాటు ఏప్రిల్ నుంచే వీటిని వర్తింపచేసి బకాయిలు కూడా అదే రోజు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన గతంలో 3 వేల పెన్షన్ అందుకుంటున్న వారికి వెయ్యి పెంపుతో పాటు మూడు నెలల బకాయిలు కూడా కలిపి మొత్తం 7 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65.3 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. వీరికి నెలకు రూ.1939 కోట్లు ఖర్చవుతోంది.
ఇప్పుడు ఏప్రిల్ నుంచి బకాయిలతో కలిపి జూలై 1న రూ.7వేల చొప్పున, అలాగే దివ్యాంగులకు 3 వేల పెన్షన్ 6 వేలు చేసి ఇస్తే ఈ బడ్జెట్ కాస్తా రూ.4400 కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు నుంచి ఈ పెంపు అమలు చేస్తే రూ.2800 కోట్లు అవుతుందని అంచనా. వీటితో పాటు పూర్తిగా వికలాంగులైతే రూ.15 వేలు, కిడ్నీ, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల చొప్పున పెంచి ఇవ్వాల్సి ఉంది. వీటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.50 ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీని బడ్జెట్ పైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Social Plugin