Andhrapradesh,: ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ కు ముహూర్తం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ కూటమి అభ్యర్దులకు మద్దతుగా రెండు రోజులు ఏపీలో పర్యటించనున్నారు. ఈ రోజు రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ పాల్గొంటారు. మోదీ ప్రచారం వేళ కూటమిలో కొత్త టెన్షన్ కనిపిస్తోంది. రాజమండ్రిలో ప్రధాని సభకు టీడీపీ అధినేత చంద్రబాబు దూరంగా ఉంటున్నారు. ప్రధాని మోదీ పర్యటన ప్రధాని మోదీ ఇవాళ రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు.
8వ తేదీన రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలోని పీలేరులో సభకు మోదీ హాజరవుతారు. అదే రోజు సాయంత్రం విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రికి రానున్నారు ప్రధాని. అక్కడినుంచి వేమగిరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరితో పాటు కూటమికి చెందిన ఇతర అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు మోదీ. అయితే, ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కావటం లేదు.
రెండు సభల్లో ప్రచారం
రాజమండ్రి సభలో జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్ పాల్గొంటారు. ప్రధాని మోదీ ఆకాశమార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు ఆంక్షలు ఉన్నందున చంద్రబాబురాజమహేంద్రవరం సభలో పాల్గొనటానికి సాధ్యం కాలేదు. అనకాపల్లి సభకు చంద్రబాబు హాజరవుతారు. రాజమండ్రి సభలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అయిదుగురు లోక్ సభ సభ్యులు పాల్గొంటారు. ఆ సభ తరువాత ప్రధాని మోదీ అనకాపల్లి వెళ్తారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున మోదీ ప్రచారం చేయనున్నారు. ఇక ఈ నెల 8న ప్రధాని మోదీ మరోసారి ఏపీలో పర్యటన కోసం రానున్నారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది.
మోదీ ప్రసంగాల పై ఉత్కంఠ
ఈ నెల 8న మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు మోదీ. పీలేరు అసెంబ్లీ పరిధిలోని కలికిరి సభలో, చంద్రబాబు పవన్‌తో కలిసి పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ చేరుకుని..ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు. తాజాగా ధర్మవరంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేసారు. ఇక, ఇప్పుడు ప్రధాని మోదీ తమ పార్టీ అభ్యర్దులకు మద్దతుగా చేస్తున్న ప్రచారంలో ముఖ్యమంత్రి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అదే విధంగా లాండ్ టైటిల్ యాక్ట్, ముస్లిం రిజర్వేషన్ల అంశం ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో కీలకంగా మారింది.
Social Plugin