ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ తో విభేదిస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం ఈ మధ్యే వైసీపీలో చేరారు. తొలుత జనసేన నేతలతో కూడా చర్చలు జరిపిన ముద్రగడ అనంతరం పవన్ కళ్యాణ్ తన ఇంటికి వచ్చి అడగాలని షరతు పెట్టారు. అయితే పవన్ వెళ్లకపోవడంతో ఆయన అలిగి వైసీపీలో చేరిపోయారు. అనంతరం పవన్ కు రాజకీయ ప్రత్యర్ధిగా మారి పిఠాపురంలో పవన్ ప్రత్యర్థి వంగా గీతకు మద్దతిస్తున్నవారు. ఇలాంటి సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ముద్రగడ పద్మనాభం పవన్ ను విమర్శించడాన్ని తట్టుకోలేక ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి బహిరంగంగా ముందుకొచ్చి జనసేనానికి మద్దతు ప్రకటించారు. వైసీపీ నేతలు తన తండ్రి ముద్రగడను రాజకీయాల కోసం వాడుకుని వదిలేస్తారని చెప్పుకొచ్చారు. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా బార్లపూడి క్రాంతి నిన్న అనూహ్యంగా తునిలో జరిగిన వారాహి సభలో ప్రత్యక్షమయ్యారు. దీంతో అందరి కళ్లూ అటువైపే మళ్లాయి.
తన భర్త చందుతో కలిసి వారాహి సభా వేదికపైకి వచ్చిన క్రాంతిని చూసి పవన్ కళ్యాణ్ సైతం ఒకింత షాకయ్యారు. అనంతరం వారు ఎందుకు వచ్చారో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే క్రాంతి దంపతులు జనసేనలో చేరేందుకు వచ్చారని తెలుసుకుని వారిని వారించారు. అనంతరం బహిరంగంగానే క్రాంతిని జనసేనలోకి తీసుకోలేమని చెప్పేశారు. క్రాంతి దంపతులు తనకు ఇస్తున్న మద్దతుకు కృతజ్ఞుడిని అంటూనే కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ ముద్రగడ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారనే ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్న నేపథ్యంలో జనసేనాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు జనసేనలో వీరిని చేర్చుకుని నిందను నిజం చేయలేనంటూ చెప్పేశారు. అంతే కాదు త్వరలో ముద్రగడ ఇంటికి తాను వస్తానని, అక్కడే మాట్లాడుకుందామంటూ వారికి నచ్చజెప్పారు. దీంతో వారు కూడా సరేనన్నారు. ముద్రగడ అంటే తనను ఎలాంటి కోపం లేదని, భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో క్రాంతిని కచ్చితంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేయిస్తానంటూ పవన్ కీలక హామీ ఇచ్చారు.
Social Plugin