ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోరాటంలో విజయం తమదే అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ధీమాతో ఉంటే, మంత్రి రోజా మాత్రం నగరి నియోజకవర్గంలో ఎదురీదుతున్నారు. నగరి నియోజకవర్గంలో రోజా అడుగడుగున ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిన్నటికి నిన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోజా తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతలు గుడ్ బై చెప్పారు.
రోజాకు సొంత పార్టీ నేతల షాక్
శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, వడమాలపేట జడ్పిటిసి సభ్యుడు మురళీధర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రెడ్డివారి భాస్కర్ రెడ్డి, లక్ష్మీపతిరాజు, ఆరుగురు సర్పంచులు, డిసిసిబి మాజీ డైరెక్టర్లు వైసీపీకి రోజా కారణంగా రాజీనామా చేశారు. మంత్రి రోజా తమకు సముచితస్థానం ఇవ్వడం లేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి తమను దూరం పెట్టారని, ఇప్పటికి ఆమె వైఖరిలో మార్పు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రోజా ఓడిపోతారని వ్యాఖ్యలు
నియోజకవర్గంలో మంత్రి రోజా సోదరుల పెత్తనం ఎక్కువైందని, వీరి వలన స్థానిక ప్రజలతో పాటు వైసిపి నేతలు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు చెప్పారు. రోజాకు టిక్కెట్ ఇస్తే ఓడిపోతారని ముందే చెప్పామని పేర్కొన్నవారు చివరకు రాజీనామా చేశారు. మొత్తం ఐదు మండలాల వైసిపి నేతలు రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రజల్లోనూ రోజాపై వ్యతిరేకత
ఇక ఇదే సమయంలో తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది. ప్రజలలో కూడా రోజాపైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వడమాల పేట మండలం వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారాన్ని నిన్న రాత్రి స్థానికులు అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి వెళ్లిన క్రమంలో తమ గ్రామానికి రోజా ఏం మేలు చేశారో చెప్పాలని, ఆ తర్వాతే ఓట్లు అడగాలని వారు ప్రశ్నించారు.
Social Plugin