Ticker

6/recent/ticker-posts

నూకాలమ్మ అమ్మ సన్నిధి లో పూజలందు కున్న గోమాతలు



ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: పట్టణ ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి 60వ ఉగాది వార్షిక జాతర జరుగుతున్న క్రమంలో బుధవారం నిత్య పూజా కైంకర్యాలు అర్చక స్వాములు నిర్వహించారు.‌ ఆలయ ఛైర్మెన్ రాజాన సత్యనారాయణతో కూడిన ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద సనాతన ధర్మాన్ని అనుసరించి సర్వ దేవతా నిలయము గోమాతకు శాస్త్రోక్తంగా విశేష పూజ చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త తిప్పాభట్ల రామకృష్ణ మాట్లాడుతూ ఆవులను పెంచడం ఉత్తమాభిరుచి అన్నారు. ఆవు నుండి వచ్చే పంచగవ్యాలు మానవ జన్మను పునీతం చేస్తాయని, భూమి మీద పుట్టిన జీవరాశులలో శ్వాస ద్వారా ప్రాణ వాయువును విడిచిపెట్టే ఏకైక ప్రాణి ఆవు మాత్రమే అన్నారు. ఆవులను పెంచి, వాటితో పాటు జీవిస్తే సర్వ రోగాలు మటుమాయం అవుతాయని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ఆవులను పోషించి, తమ జీవితాన్ని సార్ధక పరచుకోవాలని హితవు పలికారు. ఈ సత్యాన్ని విదేశీయులు నిరూపించి ఆచరిస్తున్నారని తెలియ గుర్తుజేశారు. చైర్మన్ రాజాన మాట్లాడుతూ లోక మాతాయ విద్మహే గోమాతాయ ధీమహి తన్నో గావః ప్రచోదయాత్ అని గాయత్రీ మంత్రం చెబుతుంది కాబట్టి మనమందరం ఆవులను పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేయాలని కోరారు. 60వ ఉగాది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 12గంటల నుండి భారీ అన్న సమారాధన జరుగుతుందని భక్తులందరూ విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.

ఈ అన్న సమారాధనకు ముళ్ళపూడి వీర రాఘవులు, నాగమణి దంపతులు రూ 5,116/ లు, రొంగల నాగేశ్వరావు, రమాదేవి దంపతులు రూ 5,116/ లు, గాలి నూకరాజు, నాగదేవి దంపతులు రూ 2,116/ లు, మూతిన వీర్రాజు సుబ్బలక్ష్మి దంపతులు రూ 5,116/ లు మరియు పోలుపర్తి రాము సత్యవతి దంపతులు రూ 5,116/ లు అమ్మ వారి వస్త్ర అలంకరణకు పుష్పా లంకరణకు ప్రసాద వితరణ మరియు అన్న సమారాధనకు విరాళాలు ఇచ్చి సహకరించారని, వారినీ వారి కుటుంబాలను వ్యవసాయ వ్యాపారాలను అమ్మ వారు ఎల్లవేళల కాచి కాపాడాలని కోరారు.

సుమారు పది వేలమందికి జరుగు అన్న సమారాధనకు దాతలు ధన రూపంలోనూ, వస్తు రూపంలోనూ మరియు సేవ రూపంలోనూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు అభివృద్ది కమిటీ సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని భక్తులకు యే విధమైన ఇబ్బందీ లేకుండా చూచి ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు అని తెలియజేసారు.