Ticker

6/recent/ticker-posts

శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యసన్నిధిలో చిన్నారులచే సామూహిక సరస్వతీపూజ


ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పట్టణ ఉత్తరాన కొలువైయున్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి 60 వ ఉగాది వార్షిక జాతరలో భాగంగా మూడవరోజైన ఆదివారం చిన్నారుల విద్యాప్రగతికి సామూహిక సరస్వతీ పూజను ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) సారధ్యంలోని ఆలయకమిటీ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు యర్రమిల్లి మనోజ్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

   
ఆలయమండపంలో జరిగిన సరస్వతీ పూజలో అధ్యాత్మికవేత్త కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ పాల్గొని సరస్వతీ అవతార విశిష్టతను తెలియజేస్తూ జ్ఞానం మరియు తెలివితేటలు, విద్య మరియు సృజనాత్మకత యొక్క దివ్యస్వరూపిణయిన సరస్వతీదేవి కృప తోడైతే ఉన్నతంగా ఎదుగుతామని, చదువుకునే వయస్సులో చదువును నిర్లక్ష్యం చేయడం తీరని నష్టం భవిష్యత్ పై చూపుతుందని, శ్రద్ధగా చదివి చదివింది మననం చేసి, మననం చేసిన దానిని గుర్తించుకుని, గుర్తున్న అంశం పరీక్షలలో రాతద్వారా చూపి తద్వారా విజయం సాధించడం సరస్వతీ కృపని, తల్లిదండ్రుల పట్ల అనురాగం, ప్రేమ, పెద్దలపట్ల గౌరవ భావం, గురువులపట్ల భక్తిభావం, సమాజంపట్ల బాధ్యత ఉత్తమ పౌరునిగా ఎదిగేక్రమం సరస్వతీదేవి అనుగ్రహ ఆశీస్సులని, సరస్వతీ కృప దొరికితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, జీవితాన్ని అర్ధవంతమైన స్థితికి చేరుస్తుందని తెలిపారు.

అనంతరం చిన్నారులచే గణపతిపూజ చేయించి సరస్వతీ షోడశోపచార పూజను నిర్వహింపచేయిస్తూ ధ్యానం, ఆవాహన, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం ఇలా ప్రతీ అంశాన్ని చిన్నారులకు వివరిస్తూ భక్తి ఇచ్చే శక్తిని గురించి తెలియజేస్తూ పూజను సంపూర్తి చేయించారు. డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతీ నెలా సరస్వతీ దేవి నక్షత్రమైన మూలానక్షత్రం రోజు ఉదయం 7:45 కు అమ్మవారి ఉత్సవమూర్తికి 108 స్వర్ణపుష్పాలతో స్వర్ణపుష్పార్చన ఆలయంలో జరుగుతుందని, జాతర మరియు శరన్నవరాత్రి వేడుకల్లో సామూహికంగా సరస్వతీ పూజ చిన్నారులతో చేపట్టామని ఈరోజు పాల్గొన్న చిన్నారులకు పుస్తకం మరియు కలంతో పాటు పూజాసామాగ్రి ఆలయకమిటీ అందించిందని తెలిపారు.
   
సాయంత్రం అమ్మవారు మాడవీధుల్లో గ్రామోత్సవం చేశారు. అనంతరం అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు శీలా రూపాదేవి శిష్యబృందంచే కూచిపూడి, భరతనాట్యంతో కూడిన నృత్యార్చన ఆలయ ముఖమండపంపై జరిగింది. కాగా జాతర వేడుకల్లో నాలుగవ రోజైన సోమవారం అమ్మవారి మూల విరాట్ కు పంచామృతాలతో అభిషేకం అనంతరం నిత్యపూజలు నిర్వహించి తొమ్మిది గంటల నుండి శ్రీనర్మదా బాణ లింగేశ్వర స్వామి వారికి, అమ్మవారికి అభిషేకం చేపట్టి స్వర్ణ వర్ణ పూర్ణ కవచంతో నూకాలమ్మ అమ్మవారి దర్శనం ఉంటుందని, మధ్యాహ్నం రెండు గంటల నుండి తాండ్ర పాపారాయుడు సెంటర్ వెలమపేట రామాలయం వద్ద నుండి సింహవాహన రథంపై శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి గ్రామోత్సవం భారీ ఊరేగింపుతో అత్యంత వైభవోపేతంగా జరుగుతుందని ప్రతీ ఒక్కరూ పాల్గొనవల్సినదిగా ఆహ్వానించారు.

అమ్మ వారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ మరియు ఉగాది ఉత్సవాల నిర్వహణకు జెట్టి గుర్నాథరావు, శ్రీమతి శైలజ దంపతులు రూ 5,116/ లు, వంగా రాము శ్రీమతి శివ సుమతి (అమెరిక)కుటుంబ సభ్యులు రూ 10,116 /లు మరియు డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు, శ్రీమతి మాధవి దంపతులు( సుశీల హాస్పటల్) రూ 10,116/ లు విరాళాలు సమర్పించారు. కొత్త అమావాస్య, క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవాల సందర్భంగా అమ్మ వారు విశేష అలంకరణలో దర్శనమిస్తారని అన్నారు. ది 12.4.24 శుక్రవారం ఉదయం 12గంటల నుండి అఖండ అన్న సమారాధన జరుగుతుందని,
కావున భక్తులు అందరూ విచ్చేసి, అమ్మ వారిని దర్శించి అన్న ప్రసాదం స్వీకరించి అమ్మ వారి దివ్య అనుగ్రహం పొందాలని ఆహ్వానము పలికారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు, అభివృద్ది కమిటీ సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని భక్తులకు యే విధమైన ఇబ్బంది కలగకుండా చూచి ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు అని తెలియజేశారు.