Ticker

6/recent/ticker-posts

యంఐజి లేఅవుట్‌ను త్వరితగతిన అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి: మంత్రి పొంగూరు నారాయణ


ఏలూరు, జూలై 4: శనివారపుపేటలోని యంఐజి (MIG) లేఅవుట్‌ను సమగ్రంగా అభివృద్ధి చేసి, త్వరితగతిన ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం లేఅవుట్‌ను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పట్టణానికి సమీపంలో ఉన్న ఈ లేఅవుట్‌ను అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్, పారిశుధ్యం, మొక్కల పెంపకం తదితర పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. కొనుగోలు చేసిన భూములకు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని, అలాగే మిగిలి ఉన్న ప్లాట్లను త్వరితగతిన బహిరంగ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఇంజనీర్-ఇన్-చీఫ్ ఎం. ప్రభాకరరావు, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ. భాను ప్రతాప్, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణి శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్. పెదబాబు, చోడే వెంకటరత్నం, ప్లానింగ్ అధికారి ఎన్. సురేఖ, తహసీల్దార్ కె. గాయత్రీదేవి, కార్పొరేటర్లు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.