ANDRAPRADESH, POLAVARAM, JUN 07: పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం నెలకోట–పూడిపల్లి టన్నెల్ సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని అటవీ శాఖ డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ‘హనుమాన్’ ప్రత్యేక బృందాలు రాత్రంతా అప్రమత్తంగా నిఘా కొనసాగించాయి.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ దళాధిపతి పి.వి. చలపతిరావు, ప్రధాన అటవీ సంరక్షణాధికారి ఎన్. నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ప్రధాన అటవీ సంరక్షణాధికారి డా. జ్యోతి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫీల్డ్ బృందాలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. అలాగే బెంగళూరు నుంచి వచ్చిన వన్యప్రాణి నిపుణుల బృందం కూడా ఆపరేషన్‌లో పాల్గొని సాంకేతిక సలహాలు అందిస్తోంది. రంపచోడవరం డీఎఫ్‌వో రామచంద్రరావు స్వయంగా ఘటనాస్థలంలో మకాం వేసి ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
డ్రోన్లు, లైట్లు, శబ్ద పరికరాల సహాయంతో పులి గ్రామాల వైపు కదలకుండా అటవీ శాఖ చర్యలు చేపట్టింది. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది కాలినడకన కొండ ప్రాంతాలకు చేరుకుని పులి కదలికలను సమీపం నుంచి గమనిస్తున్నారు. గ్రామాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు గుంపులుగా చేరవద్దని, పులిని చూడటానికి ప్రయత్నించవద్దని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

