Ticker

6/recent/ticker-posts

జూలై 11న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయ లోక్ అదాలత్


ఏలూరు, జూలై 4: రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు ఈ నెల **11వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్** నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎస్. శ్రీదేవి తెలిపారు. శనివారం జిల్లా కోర్టు భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు **10,003 రాజీ యోగ్యమైన కేసులను** గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసుల్లో రాజీ కుదిరేలా మధ్యవర్తిత్వం నిర్వహిస్తూ, ఇరు పక్షాల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. నోటీసులు అందని కక్షిదారులు తమ పరిధిలోని కోర్టులను సంప్రదించి కేసుల పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు.

ప్రస్తుతం కోర్టుల్లో కేసులు అధిక సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నందున వాటి పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతోందని పేర్కొన్నారు. అందువల్ల కక్షిదారులు సానుకూల దృక్పథంతో, స్నేహపూర్వక వాతావరణంలో రాజీకి సిద్ధమైతే సమయం, ధనం రెండూ ఆదా అవుతాయని చెప్పారు. జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని కేసుల నుంచి త్వరితగతిన విముక్తి పొందాలని కోరారు. గత మార్చిలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో **9,530 కేసులు రాజీ ద్వారా పరిష్కారమైనట్లు** వెల్లడించారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ప్రత్యక్షంగా హాజరు కాలేని కక్షిదారులు ఆన్‌లైన్‌ ద్వారా కూడా లోక్ అదాలత్‌లో పాల్గొని తమ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కేసుల పరిష్కారానికి సంబంధించిన సందేహాలు లేదా సమస్యలు ఉంటే **08812-224555** లేదా **15100** హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఎ. మేరీ గ్రేస్ కుమారి తదితరులు పాల్గొన్నారు.