Ticker

6/recent/ticker-posts

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!


TELANGANA, HYDERABAD, JUN 09: హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం సోమవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయగా.. వేలాది మంది ప్రజలు ప్రసాదం కోసం తరలివచ్చారు.


చేప ప్రసాదం పంపిణీ కోసం ఫిషరీస్‌ శాఖ మొత్తం 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. ఇందులో లక్షా 40 వేల కొరమీను చేప పిల్లలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి మరిన్ని చేప పిల్లలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు 50 వేల మందికి పైగా చేప ప్రసాదం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి రోగులు రెండు రోజుల ముందుగానే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈసారి సుమారు 3 లక్షల మందికి పైగా ప్రసాదం తీసుకునేందుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో ప్రజలు ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. చిన్న సజీవ చేప నోటిలో ప్రత్యేక ఆయుర్వేద మందును ఉంచి రోగులు మింగే విధంగా ప్రసాదాన్ని అందజేస్తారు. చేపలు తినలేని శాకాహారులకు అదే మందును బెల్లంతో కలిపి అందిస్తున్నారు. ప్రసాదం కోసం వచ్చిన ప్రజలకు ప్రభుత్వం విస్తృత సౌకర్యాలు కల్పించింది. వృద్ధులు, వికలాంగులు, వీఐపీల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల ద్వారా ప్రజలను క్రమబద్ధంగా పంపించి, వాలంటీర్ల సహాయంతో ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ చేప ప్రసాదం పంపిణీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది.