ఆంధ్రప్రదేశ్, పోలవరం జూన్ 09: పోలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు గిరిజనులను ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ.జీ.ఆర్.ఎస్)లో వెలుగుచూసింది. బాధితులు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
బాధితుల కథనం ప్రకారం, పోలవరం మండలానికి చెందిన శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి భర్త భూక్యా విజయ్ కుమార్ నాయక్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి గత నాలుగేళ్లుగా పలువురు అమాయక గిరిజనుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించారు. ఒక్కో వ్యక్తి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలవరం మండలం సిరివాక గ్రామానికి చెందిన అరగంటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు బాధితులు మాట్లాడుతూ, కూటమి నాయకుల పేర్లు చెప్పి ఉద్యోగాల హామీ ఇచ్చారని, అయితే డబ్బులు తీసుకున్న తర్వాత ఉద్యోగాలు కల్పించకుండా వివిధ కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పలుమార్లు ఆయనను కలిసి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా సరైన స్పందన లభించలేదని తెలిపారు.
న్యాయం కోసం పలుమార్లు ఆయన స్వగ్రామానికి వెళ్లినా అందుబాటులోకి రాలేదని, ఉద్దేశపూర్వకంగానే తప్పించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల ఆశతో అప్పులు చేసి డబ్బులు చెల్లించామని, ఇప్పుడు ఉద్యోగాలు రాకపోవడంతో పాటు ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, తమ నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించేలా చర్యలు చేపట్టాలని బాధితులు పీ.జీ.ఆర్.ఎస్ వేదికగా జిల్లా అధికారులను కోరారు. అధికారులు ఫిర్యాదును స్వీకరించి తగిన విచారణ చేపడతామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
_11zon.png)
