ANDRAPRADESH, MANGALAGIRI, JUN 02: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ పోలీసుల అనుమతుల వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 2న నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’కు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పవన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించనున్న మీడియా సమావేశానికి అయినా అనుమతి ఇస్తారా లేదా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో మంగళవారం సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటానని తెలిపారు. ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు అయినా తెలంగాణ పోలీసు శాఖ అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నానంటూ పవన్ సెటైరికల్ కామెంట్ చేశారు. ‘ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా? లేదా? చూద్దాం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
రాయదుర్గంలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో జూన్ 2న నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల నిర్ణయం అనంతరం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సభకు అనుమతి నిరాకరణపై జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. పవన్ నిర్వహించనున్న మీడియా సమావేశంలో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయి.

