ANDRAPRADESH, AMARAVATHI, JUL, 14: ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) గడువును పొడిగించింది. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తుల మేరకు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) చేసిన విజ్ఞప్తి, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం, సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఏపీలో ఈ రోజుతో ముగియాల్సిన SIR ప్రక్రియను జూలై 24వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించింది.
కొత్త షెడ్యూల్..
సవరించిన షెడ్యూల్ ప్రకారం, బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) జూన్ 15 నుంచి జూలై 24 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా జూలై 24లోపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియ అనంతరం జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు ఓటరు జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు పరిశీలించి పరిష్కరించనున్నట్లు ఈసీ వెల్లడించింది.
అన్ని ప్రక్రియలు పూర్తయిన అనంతరం అక్టోబర్ 3, 2026న ఆంధ్రప్రదేశ్ తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్రంలోని అన్ని ఎన్నికల అధికారులకు, రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కొత్త షెడ్యూల్‌పై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించి, ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, తెలంగాణలోనూ ఈ నెల 24వ తేదీన SIR గడువు ముగియనున్న విషయం విదితమే..

