Ticker

6/recent/ticker-posts

2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..


ANDRAPRADESH, AMARAVATHI, JUL 31: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా విభాగాన్ని గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేశామని, భవిష్యత్ ఎన్నికల్లో ఇది పార్టీకి మరింత బలంగా ఉపయోగపడుతుందని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, జగన్ సందేశాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైసీపీకి అధికారమే లక్ష్యం కాదని, ప్రజల సంక్షేమమే పార్టీ ప్రధాన అజెండా అని సజ్జల స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విధానంలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మారే నాయకుడు కాదని, తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకుడేనని జగన్‌ను అభివర్ణించారు.


చంద్రబాబు నాయుడు రాజకీయాలు అధికారం కోసం ఉంటే, వైసీపీ రాజకీయాలు ప్రజల కోసం ఉంటాయని సజ్జల వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కొన్ని వర్గాలు మీడియాను ఉపయోగించి ప్రజల్లో భ్రమలు సృష్టించాయని, ప్రస్తుతం సోషల్ మీడియా ప్రజలతో నేరుగా మమేకమయ్యే అత్యంత ప్రభావవంతమైన వేదికగా మారిందని చెప్పారు. అయితే, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే మరింత భారీ మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే పూర్తి నమ్మకం తమకు ఉందని సజ్జల తెలిపారు. పార్టీ కార్యకర్తల త్యాగాలు, కష్టాల వల్లే వైసీపీ ఈ స్థాయిలో నిలబడగలిగిందని కొనియాడారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా జగన్ ముందుండి నాయకత్వం వహిస్తున్నారని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని వెల్లడించిన సజ్జల, ఒక్క పంచాయతీని కూడా పోటీ లేకుండా వదిలే పరిస్థితి ఉండదని జగన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ పర్యటనలకు ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందనే విషయాన్ని నిరూపిస్తోందని పేర్కొన్నారు. పేదలకు ఉపయోగపడని రాజకీయాలకు జగన్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వరని సజ్జల అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భారీ పరిశ్రమలు, పోర్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, కేవలం పైపై కనిపించే అభివృద్ధి (కాస్మెటిక్ డెవలప్‌మెంట్) వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రత్యేక సూచనలు చేసిన సజ్జల, వైఎస్‌ జగన్ చెప్పే అంశాలను చిన్న చిన్న వీడియోలు, క్యాప్సూల్స్ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి సోషల్ మీడియా కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేర్చే ప్రచారకుడిగా పనిచేయాలని కోరారు. అసభ్య పోస్టులు, వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. పార్టీ కమ్యూనికేషన్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియా బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి..