జంగారెడ్డిగూడెం, జూన్ 15: జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ ఆలయంలో ఉన్న శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామివారి పంచలోహ ఉత్సవలింగానికి సోమవారం సందర్భంగా వైభవంగా పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కాళ్లకూరి శంకర్ మహేష్ శర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు మాట్లాడుతూ, ప్రతి సోమవారం ఉదయం శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు తమ చేతుల మీదుగా ఉచితంగా అభిషేకాలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
అమ్మవారికి వెండి చీర తయారీ కార్యక్రమం కొనసాగుతున్నందున భక్తులు వెండి లేదా నగదు రూపంలో విరాళాలు అందించి సహకరించాలని కోరారు. అలాగే అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణతో పాటు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు, భక్తులు ఉదారంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతకాయల అచ్చిరాజు, రొంగల సత్యనారాయణ, మహేష్, జగదీష్, బోను రమణ, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, వివిధ సేవా సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఈ విషయాన్ని ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపారు.

