ఆయిల్ పామ్ సాగుతో రైతుల ఆదాయం పెరుగుతుంది: ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు
ఏలూరు, జూన్ 25: దేశంలో వంట నూనెల అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు.
ఉద్యాన పంటల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉంగుటూరులో నిర్వహించిన “మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్” కార్యక్రమాన్ని గురువారం పాతూరి విజయ్‌కుమార్ తోటలో మొక్క నాటి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భూగర్భ జలాల వినియోగంలో ఏలూరు జిల్లా ముందంజలో ఉందని, ఒక సీజన్‌లో వరి సాగుకు సుమారు 1.25 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుందని పేర్కొన్నారు. అదే నీటితో మూడు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చని, బోరు నీటిపై ఆధారపడే రైతులు వరి స్థానంలో ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటల వైపు మళ్లాలని సూచించారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారి సాజ్ నాయక్ మాట్లాడుతూ, ఆయిల్ పామ్ మొక్కలను రైతులకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. కొత్తగా ఆయిల్ పామ్ తోటలు ఏర్పాటు చేసుకునే రైతులకు హెక్టారుకు నాలుగేళ్ల కాలంలో సుమారు రూ.71 వేల వరకు రాయితీలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
ఆయిల్ పామ్ గెలలు రవాణా కోసం చిన్న ట్రాక్టర్, ట్రాలీ కొనుగోలుకు రూ.2 లక్షల వరకు సబ్సిడీ అందుబాటులో ఉందన్నారు. సాళ్లూ పద్ధతిలో మొక్కలు నాటితే అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు.
డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులు సమీప రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడులు సాధించిన రైతులను దుశ్శాలువాలతో సన్మానించారు. అనంతరం 1,660 ఆయిల్ పామ్ మొక్కలను రైతులకు పంపిణీ చేసి మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు, తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి, Godrej Agrovet ప్రతినిధులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, రైతులు మరియు ఉంగుటూరు నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.

