ఏలూరు, జూన్ 22: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మానవత్వాన్ని చాటుతూ ఓ వృద్ధురాలి సమస్యను స్వయంగా తెలుసుకుని అధికారులను తక్షణ చర్యలకు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ, సంబంధిత శాఖల అధికారులకు సమస్యల పరిష్కారంపై సూచనలు ఇస్తున్నారు. ఈ సమయంలో చేతిలో వినతిపత్రంతో ఉన్న ఓ వృద్ధురాలు రద్దీ కారణంగా తన వద్దకు చేరుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు కలెక్టర్ గమనించారు.
వెంటనే వేదికపై నుంచి దిగివచ్చి ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆమె సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఉంగుటూరు మండలానికి చెందిన కొండేటి వెంకటలక్ష్మి తనకు రైస్ కార్డు, ట్రైసైకిల్ మంజూరు చేయాలని, నివాసం కోసం ఇల్లు కల్పించాలని వినతిపత్రం ద్వారా కోరారు.
వృద్ధురాలి పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, దరఖాస్తును వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ స్వయంగా తన వద్దకు వచ్చి సమస్యను అడిగి తెలుసుకోవడం, వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టడం పట్ల వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ చూపిన ఆప్యాయత, ఆదరాభిమానాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటన ప్రజల పట్ల జిల్లా పరిపాలన చూపుతున్న సానుభూతి, స్పందనకు నిదర్శనంగా నిలిచింది.

